Begin typing your search above and press return to search.

యూట‌ర్న్ ప‌వ‌న్‌.. కామ్రేడ్స్ తో కొత్త డీల్!?

By:  Tupaki Desk   |   4 Aug 2018 7:19 AM GMT
యూట‌ర్న్ ప‌వ‌న్‌.. కామ్రేడ్స్ తో కొత్త డీల్!?
X
మంచి మాట‌లు చెప్ప‌టం.. నీతి బోధ‌లు చేయ‌టం.. త‌మ‌కు ఎలాంటి స్వార్థం లేద‌న్న మాట‌లు చెప్ప‌టం చూసిన‌ప్పుడు.. అంద‌రూ ప‌వ‌ర్ కోసం పాకులాడుతుంటే.. వీళ్లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారన్న భావ‌న క‌లిగే ప‌రిస్థితి. అయితే.. ప్ర‌జ‌ల్ని న‌మ్మించి.. త‌మ దారికి తెచ్చుకున్న త‌ర్వాత త‌మ మ‌న‌సులోని మాట‌ను నెమ్మ‌దిగా బ‌య‌పెట్టే కొత్త త‌ర‌హా వ్యూహాన్ని ఇప్పుడు కొంద‌రు నేత‌లు అమ‌లు చేస్తున్నారు.

త‌మ‌కు ప్ర‌జాసేవ త‌ప్పించి.. ప‌వ‌ర్ అస్స‌లు అక్క‌ర్లేద‌నే ప‌వ‌న్‌.. ఈ మ‌ధ్య‌న త‌న మ‌న‌సులోని సీఎం కుర్చీ ఆశ‌ను అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌పెడుతున్నారు. ప్ర‌శ్నించ‌టం కోస‌మే పార్టీ పెట్టానే త‌ప్పించి.. పోటీ చేసి.. ప‌వ‌ర్ సొంతం చేసుకోవాల‌న్న ఆశ త‌న‌కు ఉండ‌ద‌ని.. ప్ర‌జ‌ల‌కు త‌న వంతు సాయం చేయ‌ట‌మే త‌న ముందున్న ల‌క్ష్యంగా చెబుతుంటారు.

మ‌రిలా మంచి మాట‌లు చెప్పే జ‌న‌సేనాని ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని.. ప‌వ‌ర్ ను సొంతం చేసుకోవ‌టానికి ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్న‌ట్లుగా ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. త‌ర‌చూ మాట‌లు మార్చే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో త‌ర‌చూ త‌న మాట‌ల్ని తానే మార్చేస్తుంటారు ప‌వ‌న్‌. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా.. ఎంపీ సీటు కోస‌మే 2014 ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్న విష‌యం మొద‌లు.. మీరు రాజీనామాలు చేస్తే.. నేను ఢిల్లీకి వ‌చ్చి మిగిలిన పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి మోడీ స‌ర్కారును కూల్చేస్తానంటూ వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే.

హిందీ.. తెలుగులో తెచ్చి పెట్టుకున్న ఆవేశ‌పు ప్ర‌సంగాల‌తో అద‌ర‌గొట్టే ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. బ‌హిరంగంగా తాను చెప్పే మాట‌ల్లో ఎన్నింటి విష‌యాల్లో నిల‌బ‌డ్డార‌న్న విష‌యంలోకి వెళితే మాత్రం స‌మాధానం ల‌భించ‌దు. పాచిపోయిన ల‌డ్డూలు అంటూ బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఎక్కెసం చేసిన ఆయ‌న‌.. ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌ధాని మోడీని ఎందుకు నిల‌దీయ‌ర‌న్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో అన్ని సీట్ల‌కు పోటీ చేస్తామ‌న్న ప‌వ‌న్ తో జ‌త క‌ట్టేందుకు వామ‌ప‌క్షాలు సిద్ధ‌మ‌య్యాయి. నిత్యం ఏదో ఒక పార్టీ మీద ఆధార‌ప‌డే కామ్రేడ్స్ కారణంగా న‌స్ట‌మే త‌ప్పించి లాభం అన్న‌ది ఉండ‌ద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. విభ‌జ‌న సంద‌ర్భంగా కామ్రేడ్స్ అనుస‌రించిన తీరుతో వామ‌ప‌క్ష పార్టీలపై ఆంధ్రోళ్ల‌కు ఉన్న విశ్వాసం త‌రిగిపోయిది. విభ‌జ‌న‌కు ముందు ఒక‌లా.. విభ‌జ‌న త‌ర్వాత మ‌రోలా మాట్లాడుతున్న‌ క‌మ్యూనిస్టు పార్టీల నేత‌లు.. 2019 ఎన్నిక‌ల్లో త‌మ‌కు సూట్ అయ్యే మంచి బ‌క‌రాను ఎంచుకోవాల‌న్న ప్ర‌య‌త్నాలు ప‌వ‌న్ పుణ్య‌మా అని ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఒంట‌రిగా వెళ్లే క‌న్నా.. త‌మ‌తో పాటు ప‌ది మందిని చూపించేందుకు వీలుగా వామ‌ప‌క్ష నేత‌ల్ని ఒక కొలిక్కి తెచ్చే ప్ర‌య‌త్నాలు జోరుగా సాగాయి. సొంతం బ‌లం లేని వామ‌ప‌క్షాలు.. ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఎవ‌రితో ఒక‌రితో జ‌త క‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటాయి.

తాజాగా జ‌న‌సేన మీద గాలం వేసిన ఆ పార్టీలు.. మొత్తమ్మీదా స‌క్సెస్ అయ్యాయి. త‌మ‌కు బ‌లం లేకున్నా.. ఉన్న కొద్దిపాటి బ‌లాన్ని జ‌న‌సేనానితో క‌లిసి పోటీకి దిగేందుకు ప‌వ‌న్ ను ఒప్పించాయి. రాజ‌కీయ అనుభ‌వం త‌న‌కు అంతంతే ఉంద‌ని చెప్పే ప‌వ‌న్ కు.. కామ్రేడ్స్ సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని వారితో క‌లిసి పోటీ చేసేందుకు ఓకే చేసి ఉండొచ్చ‌ని అంటున్నారు.

అయితే.. ఎప్పుడూ ఏ విష‌యం మీదా నిక‌రంగా నిల‌బ‌డ‌ని ప‌వ‌న్‌.. తాజాగా కామ్రేడ్స్ తో జ‌త క‌ట్టే విష‌యంలో వీరి బంధం ఎంత వ‌ర‌కూ ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాదు.. భూసేక‌ర‌ణ‌.. ప్ర‌త్యేక హోదాతో పాటు ప‌లు అంశాల‌పై ఉమ్మ‌డి ఎజెండాను త‌యారుచేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుత‌న్నారు.

ఎన్నిక‌ల‌కు టైం ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నా.. త‌న పార్టీలో చేరేందుకు నాయ‌కులు పెద్ద‌గా రాని వేళ‌.. త‌న‌తో జ‌త క‌ట్టేందుకు వ‌చ్చిన వామ‌పక్షాల‌కు స్వాగ‌తం ప‌లికిన జ‌న‌సేనాని.. ఇప్పుడు వారితో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే వామ‌ప‌క్షాల‌కు చెందిన టీవీ 99ను సొంతం చేసుకున్న ప‌వ‌న్ టీం.. రానున్న రోజుల్లో మ‌రిన్ని డీల్స్ పెట్టుకోవ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. యూట‌ర్న్ ల‌లో మొన‌గాడు లాంటి ప‌వ‌న్‌.. ఎర్ర‌దండుతో క‌లిసి చేసే జ‌ర్నీలో ఎన్ని విశేషాలు చోటు చేసుకుంటాయో చూడాలి.