Begin typing your search above and press return to search.

టీవీ ఛానల్.. న్యూస్ పేపర్ పెట్టే పనిలో పవన్

By:  Tupaki Desk   |   21 April 2016 7:43 AM GMT
టీవీ ఛానల్.. న్యూస్ పేపర్ పెట్టే పనిలో పవన్
X
రాజకీయాల్లో తమ వాణిని బలంగా వినిపించాలంటూ అయితే అనుకూల మీడియా సంస్థ అండదండలు అయినా ఉండాలే లేదంటే సొంత దుకాణం ఉండాలి. తెలంగాణ అధికారపక్షం వ్యవహారమే చూస్తే.. తెలంగాణ ఉద్యమ సమయంలో సొంత మీడియా దుకాణం పెట్టుకున్న తర్వాత నుంచి తమ వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేయటమే కాదు.. అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ వ్యూహం మంచి ఫలితాన్నే ఇచ్చింది.

తాజాగా ఇలాంటి వ్యూహాన్నే అమలు చేయాలని జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భావిస్తున్నారా? అంటే అవునన్న వాదన బలంగా వినిపిస్తోంది. 2019ఎన్నికల్లో క్రియాశీలక పాత్రను పోషించాలని భావిస్తున్న పవన్ కల్యాణ్.. తాజాగా సొంత టీవీ ఛానల్.. దిన పత్రికను పెట్టే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయాల్లో బలమైన వాదనను వినిపించటానికి శక్తివంతమైన మీడియా అండదండలు తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తించిన పవన్.. ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే.. ఇప్పటికే ఉన్న సొంత సిబ్బందికి నెలసరి జీతాలు ఇవ్వటమే కష్టంగా ఉందన్న విషయాన్ని తాజా ఇంటర్వ్యూల్లో చెప్పిన పవన్ కల్యాణ్.. వందలాది కోట్ల రూపాయిలతో టీవీ ఛానల్.. దినపత్రిక పెట్టటం సాధ్యమేనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే.. వెనువెంటనే సొంత మీడియా సంస్థ ఏర్పాటు చేయకపోవచ్చని.. తొలుత యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించటం.. దశల వారీగా మీడియా రంగంలోకి కాలు మోపే వీలుందన్న మాట వినిపిస్తోంది.

పవన్ కోరుకోవాలే కానీ.. ఆయన స్టార్ట్ చేసే మీడియా సంస్థలో పెట్టుబడులు పెట్టటానికి చాలామందే ఆసక్తి చూపించే అవకాశం ఉందని.. అలాంటప్పుడు నిధుల సమస్య పెద్ద ఇష్యూ కాదన్న మాట వినిపిస్తోంది. అయితే.. మీడియా సంస్థలు స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న మాటల్లో నిజం ఎంతన్నదే ఇప్పుడు అందరిని వేధిస్తోంది. ఈ అంశంపై పవన్ కాస్తంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది.