Begin typing your search above and press return to search.

అధికారికం: ప‌వ‌న్ నేతృత్వంలో మ‌హాకూట‌మి

By:  Tupaki Desk   |   16 Sep 2018 6:13 AM GMT
అధికారికం:  ప‌వ‌న్ నేతృత్వంలో మ‌హాకూట‌మి
X
అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి. ఊహించిన దాని కంటే ఎక్కువ పార్టీల‌తో క‌లిసి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధు తాజాగా చేసిన వ్యాఖ్య‌తో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

నెల‌ల త‌ర‌బ‌డి కూట‌మి రూపురేఖ‌ల గురించి ప‌వ‌న్ తో క‌లిసి మంత‌నాలు సాగించిన ఉభ‌య క‌మ్యూనిస్ట్ పార్టీలు.. ఎట్ట‌కేల‌కు కూట‌మికి ఒక రూపును ఇచ్చారు. త‌న‌తో జ‌త క‌ట్టేందుకు మొద‌ట్నించి ఆస‌క్తిని చూపుతున్న ఉభ‌య లెఫ్ట్ పార్టీల‌తో పాటు మ‌రికొన్ని పార్టీల‌తో క‌లిసి ప‌వ‌న్ మ‌హాకూట‌మిని త‌యారు చేశారు.

రానున్న రోజుల్లో ఏపీలో జ‌రిగే అసెంబ్లీ.. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ జ‌న‌సేన‌తో పాటు ఉభ‌య క‌మ్యునిస్ట్ పార్టీల‌తో పాటు బీఎస్పీ.. లోక్ స‌త్తా.. ఆమ్ ఆద్మీ పార్టీలు క‌లిసి ఒక కూట‌మిగా ఏర్ప‌డ‌నున్నాయి. ఈ మ‌హా కూట‌మి ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నుంది.

ఒక‌వైపు నువ్వా నేనా అన్న‌ట్లుగా అధికార టీడీపీ.. విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు త‌ల‌ప‌డుతున్నాయి. అలాంటివేళ‌.. బీజేపీ ఒక‌వైపు.. చిన్న చిన్న పార్టీల‌తో క‌లిసి ఒక కూట‌మిగా త‌యారైన ప‌వ‌న్ ఏ మేర‌కు పోటీని ఇస్తారో చూడాలి.

తోక పార్టీలుగా అభివ‌ర్ణించే క‌మ్యూనిస్టుల‌తో పాటు.. ఏపీలో ఉనికి అనేదే లేని బీఎస్పీ.. లోక్ స‌త్తా.. ఆమ్ ఆద్మీ పార్టీల‌తో క‌లిసి జ‌న‌సేనాధినేత ఏ మాత్రం త‌న మార్క్‌ను చూపిస్తారో చూడాలి.