Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్.. ఇప్పుడు అయినా స్పందిస్తారా?

By:  Tupaki Desk   |   10 May 2019 1:02 PM IST
పవన్ కల్యాణ్.. ఇప్పుడు అయినా స్పందిస్తారా?
X
కనీసం తన పార్టీ ఎంపీ అభ్యర్థి మరణిస్తే వారి కుటుంబాన్ని పరామర్శించడా పవన్ కల్యాణ్..' అనే కామెంట్ గట్టిగా వినిపిస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో పవన్ కల్యాణ్ ఎట్టకేలకూ పరామర్శకు రెడీ అవుతున్నారని సమాచారం. ఇటీవల మరణించిన కర్నూలు జిల్లా జనసేన నేత - ఆ పార్టీ నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి మరణంపై పవన్ కల్యాణ్ స్పందించబోతున్నారని తెలుస్తోంది. ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించనున్నట్టుగా తెలుస్తోంది.

మరి పరామర్శకు వచ్చినప్పుడు పవన్ కల్యాణ్.. రాజకీయం గురించి స్పందిస్తారా? అనేది ఆసక్తిదాయకమైన అంశం అవుతోంది. ఇప్పుడు పవన్ స్పందించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఎన్నికలు జరిగిన తీరు మీద - అనంతర పరిణామాల మీద - జనసేన తదుపరి రాజకీయ కార్యాచరణ మీద - తమ పార్టీ విజయావకాశాల మీద.. ఇలా చాలా అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయి!

పోలింగ్ తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు స్పందిస్తున్నారో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇక జగన్ కూడా కీలకమైన అంశాల మీద స్పందిస్తూ ఉన్నారు. అయితే పవన్ మాత్రం పూర్తిగా మొహం చాటేశారు.

చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం మీద ఆందోళనతో ఉన్నారని, జగన్ ఈ సారి విజయం తమదేనని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని స్పష్టం అవుతోందని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ పవన్ కల్యాణ్ లెక్కలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని జర్నలిస్టిక్ సర్కిల్స్ అనుకుంటున్నాయి.

ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మరి పవన్ ఆ విషయంలో బాబును సమర్థిస్తారా? ఖండిస్తారా? అనేది కూడా మరో అంశం. వీటన్నింటి మీదా పవన్ స్పందించాల్సి ఉంది. పరామర్శకు వెళ్లినప్పుడు స్పందిస్తారా లేక.. తనకు పట్టనట్టుగా వ్యవహరిస్తారా?