Begin typing your search above and press return to search.

చంద్రబాబు+కేఏ పాల్ = పవన్ కల్యాణ్

By:  Tupaki Desk   |   7 July 2018 5:12 AM GMT
చంద్రబాబు+కేఏ పాల్ = పవన్ కల్యాణ్
X
ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. అలాంటిది చంద్రబాబుతో నాలుగేళ్లు సావాసం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అందుకేనేమో... అంతా తన మహిమే అంటున్నారు. అచ్చం చంద్రబాబులాగే అందరి విజయాల వెనుకా తానే ఉన్నానంటున్నారు. దీంతో చంద్రబాబులాగే నవ్వుల పాలవుతున్నారు.

ఇప్పటికే విజయనగరం ఎంపీ - కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తన వల్లే గెలిచారని క్లెయిమ్ చేసుకున్న పవన్‌ ను చూసి జనం నవ్వడమే కాకుండా ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నేతలు కూడా గడ్డిపెట్టారు. అయినా.. పవన్ మాత్రం తన తీరేమీ మార్చుకోలేదు. మంత్రి గంటా శ్రీనివాసరావు - ఎంపీ అవంతి శ్రీనివాస్ గత ఎన్నికల్లో గెలిచారంటే అది తన పుణ్యమేనంటూ మళ్లీ కొత్త క్లెయిములు చేశారు.

చంద్రబాబు కూడా ఇలాగే ప్రతిదీ తన ఖాతాలో వేసుకుంటారనే విషయం తెలిసిందే. వాజపేయి ప్రధాని కావడానికి - దేవెగౌడ ప్రధాని కావడానికి - కలాం రాష్ట్రపతి కావడానికి - సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో కావడానికి.. పీవీ సింధు ఒలింపిక్స్ పతకం గెలవడానికి.. ఒకటా రెండా ఇలాంటి ఎన్నో విజయాలకు తానే కారణమంటారు చంద్రబాబు. ఇప్పుడు ఆ చంద్రబాబుకే దగ్గులు నేర్పిస్తున్నారు పవన్. ఆయన పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు - ఎమ్మెల్యేలు అందరి విజయంలో తనదే కీలక పాత్ర అంటున్నారు పవన్. దీంతో పవన్.. చంద్రబాబునే మించిపోయేలా గొప్పలు చెప్పుకొంటున్నారని... చంద్రబాబు వద్ద శిష్యరికం బాగా పనిచేసిందంటూ సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు పడుతున్నాయి.

కొందరైతే ఆయన కేఏ పాల్‌ ను గుర్తుకుతెస్తున్నారంటున్నారు. కేఏ పాల్ కూడా అమెరికా అధ్యక్షుడి విజయం నుంచి ప్రపంచ దేశాల మధ్య రాజీలు కుదర్చడం - శాంతి ఒప్పందాల వరకు అంతా తన ఖాతాలో వేసుకుంటారు. జార్జి బుష్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు అందరి పేర్లూ చెప్తుంటారు. ఇప్పుడు పవన్ కూడా ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా నేతలు తన వల్లే గెలిచారంటున్నారు.

కాగా 2014 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేసిన పవన్ ఆ తరువాత నాలుగేళ్ల పాటు ఆ పార్టీతోనే ఉన్నప్పటికీ ఇటీవల కొద్ది నెలలుగా పూర్తిగా దూరమై టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సొంతంగా బలం సాధించుకునే దిశగా ఆయన టీడీపీనే టార్గెట్ చేసి జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.