Begin typing your search above and press return to search.

పవన్.. ఒక ట్వీట్ల పులి

By:  Tupaki Desk   |   26 Jan 2017 5:29 PM GMT
పవన్.. ఒక ట్వీట్ల పులి
X
ఎవరి మానాన వాళ్లు ఉన్న వేళ.. తట్టి లేపటం ఎందుకు.. ఆవేశాన్ని పీక్ స్టేజ్ కు తీసుకెళ్లటం ఎందుకు? సరైన ప్లానింగ్ లేకుండా అత్తా పత్తా లేకుండా పోవటం ఎందుకు? కోట్లాది మందిని నిరాశ పర్చటం ఎందుకు? లాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు పవన్ వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. మెరీనా బీచ్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని విశాఖ ఆర్కే బీచ్ దగ్గర శాంతి నిరసన చేపట్టాలన్న ఐడియాను తెర మీదకు తీసుకొచ్చారు. దానికి తన మద్దతు ఉంటుందని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆ తర్వాత నుంచి అదే పనిగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూనే వచ్చారు.

కవితలు.. పాటలు.. కొటేషన్ల.. వీటలన్నింటితో పాటు పంచ్ డైలాగులతో కూడి ట్వీట్లు వేస్తూ.. వాతావరణాన్ని వేడెక్కించారు. ఓపక్క షూటింగ్ లో బిజీగా ఉంటూ.. వరుసపెట్టి ట్వీట్ల మీద ట్వీట్లు చేసేశారు. పవన్ తీరు చూసినప్పుడు ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాలి. పవన్ లో నిజంగానే ఆర్కే బీచ్ శాంతి నిరసనను సక్సెస్ చేయాలన్న ఆలోచనే ఉంటే.. ఆయన ఎందుకు హైకోర్టును అనుమతి కోసం ఆశ్రయించలేదు? శాంతి నిరసనకు తాను వ్యక్తిగతంగా పూచీ కత్తు ఉంటానన్న మాటను ఎందుకు చెప్పలేదు?

న్యాయస్థానాల్ని వదిలేద్దాం. ట్వీట్ల మీద ట్వీట్లతో చెలరేగిపోయిన పెద్ద మనిషి.. తాను మద్దతు ఇస్తున్న అంశాన్ని సక్సెస్ చేయటానికి వీలుగా ఏదైనా వ్యూహాన్ని సిద్ధం చేశారా? అంటే లేదనే చెప్పాలి. ఓపక్క జనవరి 26న శాంతి నిరసన అంటూ వేడెక్కించిన పవన్.. మరోవైపు షూటింగ్ లో బిజీగా ఉండటం చూస్తే.. శాంతి నిరసన మీద ఆయనకున్న కమిట్ మెంట్ ఎంత పాటిదన్నది స్పష్టమవుతుందని చెప్పాలి.

ఇక్కడే మరో విషయాన్ని చెప్పాలి. హోదాను సాధించే విషయంలో పవన్ లో నిజాయితీ లేదని అస్సలు చెప్పటం లేదు. కాకుంటే.. కమిట్ మెంట్ తక్కువగా ఉందని చెప్పటమే ఉద్దేశం. నిరసన ర్యాలీకి తాను వెళ్లటం లేదన్న విషయాన్ని పవన్ ఎందుకుముందుగా వెల్లడించలేదన్నది ఒక ప్రశ్న. తాను వెళ్లకున్నా.. కార్యక్రమం దిగ్విజయం అయ్యేందుకు వీలుగా.. పక్కా ప్రణాళికను పవన్ ఎందుకు సిద్ధం చేయలేదన్నది అసలుప్రశ్న. ఇలాంటివేమీ చేయని పవన్.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ట్వీట్లు చేయటాన్ని మర్చిపోలేం. ఇదంతా చూసినప్పుడు కాగితం పులి మాదిరే.. పవన్.. ఉత్త ట్వీట్ల పులిగా చెప్పక తప్పదు. ట్వీట్లతో తిట్టేస్తే సరిపోదు.. ప్రజల్ని నమ్మించి మోసం చేసే నేతల తాట తీసేలా వ్యూహం పన్నాలి. అది మానేసి.. ఉరికే ట్వీట్లు చేసేస్తూ.. ప్రజల్ని ఉద్యమాలకు సిద్ధం చేస్తూ.. తాను మాత్రం బయటకు రాకుండా ఉండిపోవటం ఏ మాత్రం సరికాదనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/