Begin typing your search above and press return to search.

గుండె తరక్కుపోయేలా పవన్ తాజా ట్వీట్

By:  Tupaki Desk   |   2 Jan 2017 5:07 PM GMT
గుండె తరక్కుపోయేలా పవన్ తాజా ట్వీట్
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టైలే వేరు. సినిమాల్లోనే కాదు.. ఆయన ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ సైతం భిన్నంగా వ్యవహరించటం కొత్తేం కాదు. సగటు రాజకీయ పార్టీలకు పూర్తి విభిన్నంగా జనసేన తీరు ఉందని చెప్పాలి. పార్టీ పెట్టి ఇంతకాలమైనా.. పార్టీకి అధినేతగా పవన్ కల్యాణ్ తప్పించి.. మరో నేత అంటూ కనిపించరు. అంతేనా.. పార్టీ తరఫున మొన్నామధ్యన జీతానికి పెట్టుకున్న కొందరు ఉద్యోగులు తప్పించి.. మరెవరూ కనిపించరు.

ఇంతేనా.. మిగిలిన రాజకీయ పార్టీలకు చెందిన నేతల మాదిరి.. అదే పనిగా నోరు పారేసుకుంటూ ముష్టి రాజకీయాలు.. దరిద్రపుగొట్టు విమర్శలు చేస్తూ రాజకీయ లబ్థి పొందేందుకు చేసే చిల్లర చేష్టలకు భిన్నంగా.. ఇప్పటివరకూ ఏపీలోని మరే రాజకీయ పార్టీ చేయని విధంగా ఒక తీవ్ర సమస్యను లోకానికి తనదైన శైలిలో పరిచయం చేశారు.

అందరికి తెలిసిన శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ వ్యాధులతో వేలాదిమంది చనిపోయిన విషాదభరితమైన ఉదంతాన్ని తన తాజా ట్వీట్ తో తెర మీదకు తీసుకొచ్చారు. గడిచిన 20 ఏళ్ల వ్యవధిలో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీసంబంధిత వ్యాధులతో ఇప్పటివరకూ 20 వేల మంది మరణించారని.. లక్షల మంది కిడ్నీసంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న విషయాన్ని డాక్యుమెంటరీ రూపంలో తెర మీదకు తీసుకొచ్చారు.

ఉద్దానం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని.. వీరి వేదనను అర్థం చేసుకోవటంలో ప్రభుత్వ విఫలమైందన్న వాదనను తెర మీదకు తెచ్చిన పవన్ కల్యాణ్.. నిస్సహాయంగా నిలిచిన ఉద్దానం బాధితులతో మాట్లాడేందుకు మంగళవారం..అక్కడికి తానే స్వయంగా వెళ్లనున్నట్లు ట్వీట్ ద్వారా వెల్లడించారు.

ఉద్దానం సమస్య.. అక్కడి బాధితుల వెతల్ని కళ్లకు కట్టేలా తెలియజేయటంతో పాటు.. వారి ఇబ్బందుల్ని లోకానికి అర్థమయ్యేలా చేసేందుకు జనసేనకు చెందిన విలేకరుల బృందం వెళ్లి.. వారి సమస్యలపై అధ్యయనం చేసిందంటూ ఆసక్తికరమైన వీడియోను విడుదల చేసింది. పవన్ గళం విప్పిన నేపథ్యంలో.. ఉద్దానం ప్రజల వెతలపై ఏపీ సర్కారు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.