Begin typing your search above and press return to search.

రేపే ప‌వ‌న్ రాజ‌ధాని ప‌ర్య‌ట‌న‌

By:  Tupaki Desk   |   22 Aug 2015 12:17 PM GMT
రేపే ప‌వ‌న్ రాజ‌ధాని ప‌ర్య‌ట‌న‌
X
సినీ నటుడు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపు ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. తాడేపల్లి మండ‌లంలోని పెనుమాక గ్రామంలో ప‌వ‌న్ స్థానిక రైతుల‌తో మాట్లాడి...భూమి ఇచ్చేందుకు రైతుల‌కు ఉన్న అభ్యంత‌రాలు ఏమిటనేది తెలుసుకుని వాటిని ప్ర‌భుత్వానికి నివేదించే అవ‌కాశం ఉంది. ఆది, సోమ‌వారాల్లో ప‌వ‌న్ ఈ ప్రాంతంలో ప‌ర్య‌టించాల‌ని ముందుగా అనుకున్నా చివ‌ర‌కు ఆదివారం ఒక్క రోజు మాత్రం పెనుమాక‌లో ప‌ర్య‌టించేందుకు షెడ్యూల్ ఖ‌రారైన‌ట్టు స‌మాచారం.

నవ్యాంధ్ర రాజధానికి రైతుల నుంచి బలవంతపు భూసేకరణను ముందు నుంచి ప‌వ‌న్ వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. గ‌తంలో ఓ సారి ప‌వ‌న్ రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించి భూములు ఇచ్చేందుకు రైతుల‌కు ఉన్న ఇబ్బందులు తెలుసుకున్నారు. త‌ర్వాత వ‌రుస‌పెట్టి ట్వీట్లు చేస్తూ బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ చేస్తే తాను రైతుల త‌ర‌పున పోరాటం చేస్తాన‌ని కూడా ప్ర‌భుత్వానికి సుతిమెత్త‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూ వ‌స్తున్నారు.

ప‌వ‌న్ ట్వీట్ల‌ కు కొంద‌రు టీడీపీ మంత్రులు సెటైర్లు కూడా వేశారు. దీంతో వారికి గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్ మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటనకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా భూసేకరణకు రైతులు వ్యతిరేకంగా ఉన్న పెనుమాకలో ఆయన ఆదివారం పర్యటించనున్నారు.

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న ఏర్పాట్లు ప‌రిశీలించేందుకు ఇప్ప‌టికే ప‌వ‌న్‌కు అత్యంత స‌న్నిహితులైన ఇద్ద‌రు వ్య‌క్తులు గ‌న్న‌వ‌రం ఎయిర్‌ పోర్టులో దిగి రాజ‌ధాని ప్రాంతానికి కూడా చేరుకున్న‌ట్టు స‌మాచారం. ప‌వ‌న్ రాజధాని ప్రాంతంలో పర్యటనకు ముందు చంద్ర‌బాబుతో భేటీ అవుతారా లేదా రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకున్నాక చంద్ర‌బాబుతో భేటీ అయ్యి వాటిని ఆయ‌న‌కు వివ‌రిస్తారా అన్న‌ది తెలియాల్సి ఉంది.

రైతుల అభిప్రాయం తెలుసుకున్నాకే ప‌వ‌న్ ఏం చేయాల‌నే దానిపై త‌న కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌నున్నారు. చంద్ర‌బాబు మాత్రం ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఎవ‌రు విమ‌ర్శ‌లు చేయ‌వ‌ద్ద‌ని..ఆయ‌న‌తో సామ‌ర‌స్య పూర్వ‌కంగా ఉండి స‌మ‌స్య‌ల‌ను చెపుదామ‌ని శ‌నివారం జ‌రిగిన స‌మావేశంలో ప‌లువురికి సూచించిన‌ట్టు స‌మాచారం.