Begin typing your search above and press return to search.

బాబుకు ప‌వ‌న్ 48 గంట‌ల అల్టిమేటం

By:  Tupaki Desk   |   17 March 2018 3:58 AM GMT
బాబుకు ప‌వ‌న్ 48 గంట‌ల అల్టిమేటం
X
నాలుగేళ్లుగా క‌నిపించ‌ని మ‌చ్చ‌ల‌న్నీ.. ఒక్క‌రోజులో క‌నిపించాయా? అంత‌లా ఎలా మారిపోయారు? అంటూ ప‌వ‌న్ తీరుపై గొల్లుమంటున్నారు టీడీపీ అధినేత‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో బాబు స‌ర్కారుపై ఓ రేంజ్లో ప‌వ‌న్ ఏసుకోవ‌టం తెలిసిందే. ప‌వ‌న్ ప్ర‌సంగం త‌ర్వాత ఏపీ రాజ‌కీయాల్లో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. స‌భ అయిపోయిన త‌ర్వాత త‌న దారిన తాను హైద‌రాబాద్‌కు రాని ప‌వ‌న్.. గుంటూరులోనే ఉండిపోయారు. వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న ఆయ‌న‌.. తాజాగా గుంటూరులో కలుషిత నీరు తాగి ప‌దుల సంఖ్య‌లో జ‌నం చ‌నిపోవ‌టం ఏమిటంటూ ఫైర్ అయ్యారు.

త‌క్ష‌ణ‌మే ఆరోగ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ప్ర‌క‌టించాలంటూ డిమాండ్ చేసిన ప‌వ‌న్.. 48 గంట‌ల్లో క‌లుషిత నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలంటూ బాబు స‌ర్కారుకు అల్టిమేటం జారీ చేశారు.తాను ఇచ్చిన 48 గంట‌ల్లో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌ని ప‌క్షంలో గుంటూరు బంద్‌కు పిలుపునిచ్చి ప్ర‌త్య‌క్ష ఆందోళ‌న‌లో పాల్గొంటాన‌ని వార్నింగ్ ఇచ్చేశారు.

ఇప్ప‌టికే ప‌లువురు చ‌నిపోయి.. 500 మంది ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతుంటే అధికారుల‌తో స‌హా ఏ రాజ‌కీయ పార్టీ ఈ స‌మ‌స్య‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించ‌క‌పోవ‌టం బాధ‌గా ఉంద‌న్న ప‌వ‌న్‌.. శుక్ర‌వారం ఆసుప‌త్రిని సంద‌ర్శించారు.

మంత్రులు.. అధికారుల ఇళ్ల‌ల్లో ఇలాంటిదే జ‌రిగితే స్పందించ‌కుండా ఉంటారా? అంటూ తీవ్రంగా మండిప‌డ్డ ప‌వ‌న్‌.. సామాన్యుల ప్రాణాలంటే ప్ర‌భుత్వానికి లెక్క లేదా? అంటూ నిల‌దీశారు.

గుంటూరులో అతిసార వ్యాధి బారిన ప‌డి మృతి చెందిన కుటుంబాల‌ను.. చికిత్స పొందుతున్న వారిని పరామ‌ర్శించారు. గుక్కెడు సుర‌క్షిత నీరు ఇవ్వ‌లేని వారు ఆరోగ్య ఆంధ్రప్ర‌దేశ్ ను చేస్తామ‌న‌టం విడ్డూరంగా ఉందంటూ మండిప‌డ్డ ప‌వ‌న్‌.. ద‌శాబ్దాలుగా మురుగునీటి కాల్వ‌ల కింద తాగునీటి పైపులైన్లు ఉంటే యంత్రాంగం ఏ ద‌శ‌లో కూడా గుర్తించ‌లేక‌పోయింద‌ని.. ఎనిమిదేళ్లుగా న‌గ‌ర‌పాల‌క సంస్థ‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కుండా ఉండిపోయిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. గుంటూరు న‌గ‌ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి 48 గంట‌ల టైం ఇచ్చిన ప‌వ‌న్ అల్టిమేటానికి బాబు స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మిత్రుడిగా ఉన్న స‌మ‌యంలో ప‌వ‌న్ చెప్పిన‌ట్లే బాబు రియాక్ట్ అయ్యేవారు. స‌మ‌స్య‌ను పూర్తిగా ప‌రిష్క‌రించ‌కున్నా.. ఆదిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు క‌నిపించేవారు. మ‌రి.. తాజాగా నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ వార్నింగ్ ను బాబు ఎలా తీసుకుంటారో చూడాలి.

మ‌రోవైపు.. గుంటూరులో క‌లుషిత నీటిని తాగి మృతి చెందిన వారి సంఖ్య శుక్ర‌వారం నాటికి 17కు చేరుకోగా.. దాదాపు 80 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. అతిసారంపై ప‌వ‌న్ గ‌ళం విప్ప‌గా.. అలాంటిదేమీ లేద‌ని.. మంత్రులు.. అధికారులు చెబుతున్నారు. అయితే.. గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో అతిసారంతో బాధ‌ప‌డుతున్న 83 మంది చికిత్స పొందుతున్న విష‌యాన్ని ప‌వ‌న్ త‌న ఆసుప‌త్రి ప‌ర్య‌ట‌న‌తో వెలుగులోకి తీసుకొచ్చారు. మీడియా పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌ని.. ప్ర‌భుత్వానికి పెద్ద‌గా ప‌ట్ట‌ని ఈ స‌మ‌స్య‌ను ప‌వ‌న్ ప్ర‌స్తావించ‌టం.. దీనిపై ప్ర‌భుత్వం 48 గంట‌ల్లో స్పందించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌కుంటే బంద్ చేప‌డ‌తాన‌ని ప్ర‌క‌టించ‌టం ఇప్పుడు స్థానిక రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని వేడెక్కిస్తోంది.