Begin typing your search above and press return to search.

బాబుకు బ్రేకులేసేందుకు ప‌వ‌న్ స్పెష‌ల్ స్ట‌డీ?

By:  Tupaki Desk   |   11 Feb 2017 5:56 PM GMT
బాబుకు బ్రేకులేసేందుకు ప‌వ‌న్ స్పెష‌ల్ స్ట‌డీ?
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు దూకుడు బ్రేకులు వేసేందుకు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారా? ఈ క్ర‌మంలో త‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌లో విస్తృత మ‌థనం చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. అణువిద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు విద్యుత్ వెలుగులు పంచుతామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే గుజ‌రాత్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌లో తిర‌స్క‌ర‌ణ త‌ర్వాత ఇక్క‌డ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగ‌డంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప‌వ‌న్ త‌న తాజా అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఇందుకు త‌గిన అధ్య‌నం చేశారు. అమెరికాలోని న్యూహాంప్ పైర్ రాష్ట్రంలో సముద్రం ఒడ్డున నిర్మిచిన సీబ్రూక్ అటామిక్ పవర్ ప్లాంట్ ను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు అణు విద్యుత్ కర్మాగారాలను నిర్మించడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న నేపధ్యంలో జనసేన పవన్ కళ్యాణ్ సంద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.


భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి సీబ్రూక్ కు చేరుకున్న ప‌వ‌న్.... అటామిక్ పవర్ ప్లాంట్ లో రెండు గంటల సేపు పరిశీలన జరిపారు. అణు విచ్చిత్తి, తద్వారా జరిగే విద్యుత్ ఉత్పత్తిని నిపుణులు వివరించారు. అణు కర్మాగారం అంతర్గత భద్రత అణు ప్రమాదాలు జరగకుండా తీసుకున్న జాగ్రత్తల గురించి నిపుణులు పవన్ కళ్యాణ్ కూలంకుషంగా తెలుసుకున్నారు. అణు వ్యర్థాల నిర్వహణ, సముద్ర జలాలు కలుషితం కాకుండా ఉండడానికి ఎటువంటి పద్ధతులు పాటిస్తున్నారో అక్కడి శాస్త్రవేత్తలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. 1969 తలపెట్టిన ఈ ప్లాంట్ కు వ్యతిరేకంగా అక్కడి స్థానికులు 20 ఏళ్లపాటు ఉద్యమాలు నడిపారు. అనేక వేలమంది జైలుపాలయ్యారు. వేలాది కుటుంబాలు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలసపోయారు. చివరకు 1990 లో ఈ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం అయింది. అనంతరం న్యూ హాంప్‌షైర్ లోని కాంకర్డ్ స్టేట్ హౌస్ లో పవన్ కళ్యాణ్ రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొన్నారు. అమెరికన్ ఆటమిక్ పవర్ పాలసీ, అణు భద్రత ప్రజారోగ్యం పర్యావరణ పరిరక్షణ తదిర అంశాలపై ఈ సమావేశంలో వక్తలు వివరించారు. న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలో ఒకప్పుడు పది న్యూక్లియర్ ప్లాంట్లు ఉండేవని ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అందులో ఏడు ప్లాంట్లను మూసివేశామని వక్తలు తెలిపారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సీబ్రూక్‌ న్యూక్లియర్ ఫెసిలిటీ డైరెక్టర్ మేఘన్ లీ హై, న్యూక్లియర్ ఫెసిలిటీ జనరల్ మేనేజర్ గ్రిఫిత్ అలెన్, న్యూ హాంప్‌షైర్ స్టేట్ ప్రతినిధి లత మంగిపూడి, అమెరికన్ కాంగ్రెస్ మాజీ సభ్యుడు పాల్ హోడ్స్‌, స్టేట్ రిప్రజెంటేటివ్ క‌రెన్ అబెల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలో తలపెట్టిన రెండు అణు విద్యుత్ కర్మాగారాలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భంలో అణు విద్యుత్ పై అధ్యయనం చేయడానికి సీబ్రూక్ ప్లాంట్ ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. అణు విద్యుత్ పై తనకు ఉన్న సందేహాలను నిపుణులను అడిగి తెలుసుకున్నారు. గుజరాత్ లోని మిధి వీర్ధిలో నిర్మించ తలపెట్టిన అణు విద్యుత్ ప్లాంట్ ను అక్కడి రైతులు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో దానిని శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం కొవ్వాడలో నిర్మించడానికి నిర్ణయించారు.ఇక్కడి స్థానికులు వ్యతిరేకించినప్పటికీ నిర్మాణ సన్నాహాలు నిశ్శబ్దంగా జరిగిపోతున్నాయి. ఈ ప్లాంటుని 6600 మెగావాట్ల సామర్ధ్యంతో అమెరికా కు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్టిక్ కార్పొరేషన్ సాంకేతిక సహాయం తో NPCIL సంస్థ AP 1000 రియాక్టర్ ను ఏర్పాటుచేస్తోంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా కావలి తీర గ్రామాలయిన రుద్రకోట, చెన్నాయపాలెం గ్రామాలలో రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో 6000 మెగావాట్ల సామ‌ర్థ్యం గల అణు కర్మాగారాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత దీనిని పశ్చిమ బెంగాల్ లోని హరిపూర్ లో నిర్మించాలనుకున్నారు. అయితే అక్కడ వచ్చిన తీవ్ర వ్యతిరేకత వల్ల దీనిని నెల్లూరు జిల్లాకు మార్చారు. నెల్లూరు జిల్లా వాసులు సైతం ఈ ప్లాంట్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు చోట్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో సగం ఆంధ్రప్రదేశ్ కు దక్కుతుందని, తద్వారా విద్యుత్ కొరత తీరుతుందని పాలకులు చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉండ‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా ఈ విస్తృత అద్య‌య‌నం త‌ర్వాత ప‌వ‌న్ ఏపీలో మ‌రో నిర‌స‌న ఉద్య‌మానికి వేదిక‌గా మారుతారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.se!