Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ - టీడీపీల యుద్ధం ఎక్క‌డిదాకా?

By:  Tupaki Desk   |   20 Aug 2015 6:17 PM GMT
ప‌వ‌న్ - టీడీపీల యుద్ధం ఎక్క‌డిదాకా?
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజధానికి భూసేకరణ విషయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. భూసేకరణ చట్టాన్ని ప్రయోగించకుండా రాజధానికి భూములు సేకరించాలని పవన్‌ కల్యాణ్ ఏపీ ప్ర‌భుత్వాన్ని కోర‌గా... ఇవ్వ‌ని రైతుల నుంచి సేక‌ర‌ణ ద్వారా కాకుండా ఇంకెలా భూములు తీసుకోవాలో ప‌వ‌న్ చెప్పాలంటూ టీడీపీ మంత్రి యనమల ఎద్దేవా చేశారు. దానికి తాజాగా పవన్ ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. తాను ఎంతో బాధ్యతతో రైతుల సమస్యల్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తే... విజ్ఞతతో స్పందించడం మాని రైతుల ఆవేదనను వెటకారం చేయడం వారికే చెల్లిందని ట్విట్టర్ లో పవన్‌ ఎండగట్టారు.

హైదరాబాద్‌ లో సినీ పరిశ్రమకు కొండలు ఇచ్చారు తప్ప... బహుళ పంటలు పండే భూములు కాదని పవన్‌ కల్యాణ్ అన్నారు. ఈ విషయం మంత్రి యనమలకు బహుశా తెలీదనుకుంటా అంటూ కౌంటర్‌ ఇచ్చారు. కట్టేది స్వర్గమని ముందే తెలిస్తే.. అది త్రిశంకు స్వర్గమా? సామాన్య స్వర్గమా? అనేది తర్వాత ఆలోచించవచ్చన్నారు. త్వరలో తాను ఉండవల్లి, బేతపూడి, పెనుమాక గ్రామాల్లో పర్యటించి... రైతులతో మాట్లడతానని ట్విట్టర్ లో ప్రకటించారు. త‌ద్వారా త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను పవన్‌ కల్యాణ్ వెల్ల‌డించారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి రావెల కిశోర్ బాబు స్పందించారు. ఆయ‌న‌ విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తామని, అయితే కేవ‌లం మూడు వేల ఎకరాల కోసం రాద్దాంతం ఎందుకని ప్రశ్నించారు. ప్రాజెక్టులు, రోడ్లు, సెజ్‌ల కోసం భూసేకరణ కొత్తకాదని... అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని పవన్‌ ను మంత్రి రావెల కోరారు. రాజధాని నిర్మాణానికి అందరూ సహకరించాలని, విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తామని ఆయన అన్నారు.

మంత్రులు-ప‌వ‌న్ మ‌ధ్య జ‌రుగుతున్న మాట‌ల యుద్ధం నేప‌థ్యంల, న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా వ్య‌వ‌సాయ‌ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. 2200 ఎకరాల భూసేకరణకుగాను తొలిదశలో తుళ్లూరు మండలంలో 700 ఎకరాల రైతులకు నోటీసులిస్తామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని పవన్‌తో మాట్లాడేందుకు భేషజాలు లేవని, ఆయ‌న్ను ఒప్పించే భూ సేక‌ర‌ణ చేస్తామ‌ని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు పవన్ కళ్యాణ్‌ ఎంతో కృషి చేశారని మంత్రి అన్నారు. మంత్రులెవరూ పవన్‌ ను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడలేదని ఆయన అన్నారు. చంద్రబాబుకు, పవన్‌ కళ్యాణ్‌ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ప్రతిపక్షాలు భూముల వ్యవహారంపై లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. రాజధాని ప్రాంతవాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రత్తిపాటి సూచించారు.

ప‌వ‌న్, మంత్రుల మాట‌ల వాగ్వాదం ఇంత‌గా జ‌రుగుతుంటే.. ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఎందుకు స్పందించ‌డం లేద‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా సాగుతోంది. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌, బీజేపీ, టీడీపీ పొత్తుల్లో కీల‌క వ్య‌క్తి చంద్ర‌బాబు. ఆయ‌న వ‌ల్లే వారు కూట‌మిగా ఏర్ప‌డ్డారు. ఇపుడు ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై నిర్ణ‌యం తీసుకోవాల్సింది కూడా ముఖ్య‌మంత్రి హోదాలోని చంద్ర‌బాబు నాయుడే. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న అధికారికంగా స్పందించ‌లేదు. కానీ ఆయ‌న త‌ర‌ఫున పార్టీ మంత్రులు, సీనియ‌ర్లు సైతం మాట్లాడేస్తున్నారు. వారికి త‌గ్గ‌ట్లు ప‌వ‌న్ కౌంట‌ర్ ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య దూరం పెర‌గ‌డం త‌ప్ప మ‌రేమీ లేదు. ఒక‌వేళ బాబు మౌనం వ్యూహాత్మ‌కం అని భావిద్దాం అనుకున్నా....ప్ర‌తిప‌క్షాలు ఈ ర‌చ్చ ఆధారంగా విమ‌ర్శ‌లు చేయ‌డం ఆఖ‌రికి ఇది ఆంధ్రుల ప‌రువు బ‌జారున ప‌డేయ‌డం త‌ప్ప మ‌రేమీ లేదు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు స్పందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇంత‌కు బాబు ఎపుడు స్పందిస్తారో....