Begin typing your search above and press return to search.

పవన్ నోట తొలిసారి ఓటమి మాట

By:  Tupaki Desk   |   13 Nov 2018 4:26 PM GMT
పవన్ నోట తొలిసారి ఓటమి మాట
X
నేనే సీఎం’ అంటూ మాట్లాడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోట తొలిసారి ఓటమి మాట వచ్చింది. మంగళవారం పిఠాపురంలోని జనసేన నేతలతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓట‌మికి అయినా సిద్ధపడతాను కానీ విలువలను వదులుకోనంటూ ఆయన అన్నారు. కులాల కుంప‌ట్లు పెట్టొద్దని.. కష్టపడి జనసేన ప్రభుత్వాన్ని తెచ్చేందుకు ప్రయత్నించాలని అన్నారు. ఏమాత్రం తేడా చేసినా తుడిచిపెట్టుకుపోతామని హెచ్చరించారు. 1983లో మొద‌లైన టీడీపీ 2014కి తెలంగాణ‌లో తుడిచిపెట్టుకుపోయిందని.. ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితి ఉందని అన్నారు.

పోస్ట‌ర్లు క‌డితేనో, తన చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తేనో నాయ‌కులు అయిపోర‌నీ - గ్రామాల్లోకి వెళ్లి జ‌నం స‌మ‌స్య‌లు తెలుసుకోవాల‌నీ జ‌న‌సేన శ్రేణుల‌కి సూచించారు. ఎమ్మెల్యే - ఎమ్మెల్సీలు ఇస్తేనే ప‌ని చేస్తామ‌నే వారు త‌న ద‌గ్గ‌రికి రావ‌ద్ద‌ని స్పష్టం చేశారు. “2009 త‌ర్వాత ఎలాంటి రాజ‌కీయ అండ‌దండ‌లు లేకుండా - వేల కోట్ల ఆస్తులు లేకుండా - ఓట‌మి లోతుల నుంచి ఉన్న కొద్దిపాటి అనుభ‌వంతో పార్టీ పెట్ట‌డం చాలా క‌ష్ట‌మైన విష‌యం. అయినా నేడు జ‌న‌సేన జెండా లేని గ్రామం గానీ - జ‌న‌సైనికులు లేని ఊరు గానీ లేదు. నేను ఓ భావ‌జాలంతో ముందుకి వెళ్తుంటే - నాయ‌కులు, కో-ఆర్డినేట‌ర్ స్థాయి నాయ‌కులు - స్థానిక నాయ‌కులు చిన్న‌పాటి వ్య‌క్తిగ‌త ఇష్టాల‌తో పార్టీని ముందుకి తీసుకువెళ్తూపోతే - చూస్తూ ఊరుకోను. కొద్ది మంది ఇలా గ్రూపులు క‌డితే అర్ధం చేసుకోలేని వ్య‌క్తిని కాదు. ఎవ్వ‌రు ఉన్నా లేకున్నా ఒక్క‌డినే పార్టీని ముందుకి తీసుకువెళ్లి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ధైర్యం ఉంది’’ అంటూ పార్టీలో జరుగుతున్న వ్యవహరాలపై మాట్లాడారు.

‘‘ఈ మ‌ధ్య టీడీపీ నాయ‌కుల‌కి నోటి దుర‌ద ఎక్కువైపోయింది. ముఖ్య‌మంత్రికే నోరు అదుపు లేదు. ఎవ‌రైనా ద‌ళితుడిగా పుట్టాల‌నుకుంటారా.? అంటారు. ముఖ్య‌మంత్రి ద‌ళితుడిగా పుట్టాల‌నుకోక‌పోవ‌చ్చు.. నేను మాత్రం రెల్లి కులాన్ని స్వీక‌రిస్తాను. టీడీపీ ఎమ్మెల్యేలు కులాల పేరిట ప్ర‌జ‌ల్ని దూషిస్తారు. ఉత్త‌రాంధ్ర ఎమ్మెల్యేలు మ‌త్స్య‌కారుల్ని దూషిస్తారు. వారిని మీరు - మీ లోకేష్ స‌మ‌ర్ధిస్తారు. బాల‌కృష్ణ జ‌న‌సేన పార్టీలోకి వ‌చ్చే వారిని సంక‌ర‌జాతి నా కొడుకులు - అల‌గాజ‌నం అని తిడ‌తారు’’ చంద్రబాబు - లోకేశ్ - బాలకృష్ణలపై విమర్శలు చేశారు. టీడీపీ నేత‌లు చేసే త‌ప్పులు జ‌న‌సేన‌లో ఎవ‌రైనా చేస్తే చ‌ర్య‌లు క‌ఠినంగా ఉంటాయని హెచ్చరించారు.