Begin typing your search above and press return to search.

న‌కిలీ జ‌న‌సేన లీడ‌ర్లు ఉన్నారు జాగ్ర‌త్త‌!

By:  Tupaki Desk   |   27 July 2017 12:33 PM GMT
న‌కిలీ జ‌న‌సేన లీడ‌ర్లు ఉన్నారు జాగ్ర‌త్త‌!
X
ప్ర‌శ్నించేందుకు వ‌స్తున్నానంటూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంభించిన‌ పార్టీకి ఆదిలోనే చిక్కులు ఎదుర‌వుతున్నట్లుగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతానికి జ‌న‌సేన‌లో నాయ‌కులు ఎవ‌రూ అంటే వ‌చ్చే స‌మాధానం ప‌వ‌న్ ఒక్క‌రే. ఇటీవ‌లే ఎంపిక ప్ర‌క్రియ‌ల ద్వారా పార్టీ శ్రేణుల ఎంపిక‌కు శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే పార్టీ శ్రేణుల గుర్తింపు ప్ర‌క్రియ ఇంకా ప్రారంభ ద‌శ‌లోనే ఉన్న స‌మ‌యంలో జ‌న‌సేన‌కు న‌క‌లీల బెడ‌ద మొద‌ల‌యింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. పార్టీలో ఉన్న న‌కిలీ నేత‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరారు. ఏకంగా ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

జనసేన శ్రేణులు తస్మాత్ జాగ్రత్త పేరుతో విడుద‌ల చేసిన‌ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో పార్టీ శ్రేణుల‌కు స్ప‌ష్ట‌మైన సందేశం ఇచ్చారు. ``జనసేన పార్టీ అధికార ప్రతినిధులమని కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ జనసేన శ్రేణుల మధ్య గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఈ మధ్యకాలంలో నాదృష్టికి వచ్చింది. ఒకసారి పార్టీ ప్రచార కార్యదర్శిగాను, మరోసారి అధికార ప్రతినిధిని అంటూ మీడియావారితో కూడా పార్టీ తరపున మాట్లాడుతున్నట్లు జనసేన కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయి. కృష్ణా జిల్లాలో అయితే తానూ పార్టీ ప్రతినిధినని, విరాళాలు ఇవ్వాలని కూడా ఒక వ్యక్తి కొన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అందువల్ల ఈ సందర్భంగా జనసేన శ్రేణులు - మీడియా వారికి వాస్తవాలు తెలియచేయడానికి ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాము. జనసేన తరపున చర్చల్లో పాల్గొనడానికి ఎవరినీ నియమించలేదు. ఆ వ్యక్తులు చెప్పే మాటలు, వ్యాఖ్య‌ల‌తో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. విరాళాలు అడిగిన వారి వివరాలను పార్టీ కార్యాలయానికి తెలియచేయండి` అని ప‌వ‌న్ కోరారు.

పార్టీ నిర్మాణం కోసం తీవ్రమైన కసరత్తు చేస్తున్నామని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. ``అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులనే పార్టీ తరపున ప్రతినిధులుగా నియమిస్తాము. ఆ సమాచారాన్ని అధికారికంగా తెలియచేస్తాము. ఈ లోగా పార్టీ ప్రతినిధులమని ఎవరైనా ప్రచారం చేసుకున్నా, విరాళాలు వంటివి అడిగినా అటువంటి వారి మోసకారి మాటలను విశ్వసించవద్దని తెలుపుతున్నాను. ఇటువంటివారి పై జనసేన శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను` అని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.