Begin typing your search above and press return to search.

మీడియాకు ప‌వ‌న్ మ‌ళ్లీ వార్నింగ్ !

By:  Tupaki Desk   |   21 April 2018 12:40 PM GMT
మీడియాకు ప‌వ‌న్ మ‌ళ్లీ వార్నింగ్ !
X
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌... మీడియాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న ఆఫీసుకు, ఇంటికి అభిమానుల తాకిడి విప‌రీతంగా ఉండ‌టంతో కొంత‌సేపు ఆయ‌న అభిమానుల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియా గురించి ప్ర‌స్తావిస్తూ మ‌రోసారి వార్నింగ్ ఇచ్చారు.

ఆయ‌న ఏమ‌న్నారంటే... పోలీసు అధికారులు నా వ‌ద్ద‌కు వ‌చ్చారు. సార్ కొంచెం జాగ్ర‌త్త‌. మీ అభిమానులకు చెప్పండి. వాహ‌నాలు ధ్వంసం చేశారు... అని అన్నారు. వారికి నేను ఒక‌టే చెప్పా...ఎక్క‌డైనా నా అభిమానుల‌కు అలాంటి పిలుపును ఇచ్చానా? లేదే. అస‌లు ప‌రిస్థితి ఇంత దాకా తెచ్చిందే మీడియా. ప‌నికిరాని విష‌యాల‌పై ప్ర‌తి దానికీ ప‌వ‌న్ క‌ళ్యాణే కావాలి. ఎనిమిది నెల‌లుగా ప్ర‌తి విష‌యానికీ న‌న్నుటార్గెట్ చేశారు. అయినా, స‌హించాను. భ‌రించాను. చివ‌ర‌కు నాకు సంబంధం లేని ఇష్యూలో నా త‌ల్లిని బ‌జారుకీడ్చారు. వాళ్లు కాదా అండీ ఈ విధ్వంసానికి కార‌ణం? అని ప్ర‌శ్నించారు. తాను నిగ్రహంతో ఉండాలని కొందరంటున్నారని - అంద‌ర్నీ రెచ్చ‌గొట్టి అబద్ధాలు ప్ర‌సారం చేసి మ‌మ్మ‌ల్ని నిగ్రహంతో ఉండాలని అనడమేంటని అన్నారు. తన తల్లిని తిట్టినా తనకు చిన్నపాటి కోపం కూడా రాకూడదా? అని అన్నారు. నా ఫ్యాన్స్‌ ని విధ్వంసానికి ఎవరు ప్రేరేపిస్తున్నారు ? నేనా? వాళ్లా? అని ప్రశ్నించారు.

అయినా, మీకో విష‌యం చెప్తున్నాను. వాళ్లు మ‌న మీద ఎంత ప‌ద్ధ‌తిగా కుట్ర ప‌న్నారో... అంతే ప‌ద్ధ‌తిగా వారి మీద మ‌నం లీగ‌ల్ గా వెళ్దాం. ఈ దాడులు వీటికి మీరు దూరంగా ఉండండి. అలాంటివేమైనా చేయాల్సి వ‌స్తే నేను బ‌హిరంగంగానే చెప్తాను. దేనికీ భ‌య‌ప‌డేది లేదు. మ‌రోసారి ఇలా ఇత‌రుల మీద నింద‌లేసి - బ‌తుకుల‌ను చెరిచి ఎవ‌రి మీదైనా దాడి చేయాలంటే వెన్నులో వ‌ణుకుపుట్టాలి. ఇదో సుదీర్ఘ యుద్ధం. మ‌నం తొంద‌ర‌ప‌డకూడ‌దు. వారు త‌ప్పు చేశారు. న్యాయ‌పోరాటంతో ఇరికిద్దాం. మ‌నం తొంద‌ర‌ప‌డితే అన‌వ‌స‌రంగా వాళ్లు త‌ప్పించుకుంటారు అంటూ ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ పిలుపునిచ్చారు.

ఒక ర‌కంగా ప‌వ‌న్ ఆవేద‌న చూస్తే అన‌వ‌స‌రమైన విష‌యాల జోలికి వెళ్లిన మీడియా వ‌ల్ల అస‌లు విష‌యం చ‌ర్చ‌లో లేకుండా పోయింది. మ‌రి ప‌వ‌న్ ఎంత‌వ‌ర‌కూ పోరాడ‌తారో కాల‌మే చెబుతుంది.