Begin typing your search above and press return to search.

లాక్కోవద్దు..లాక్కోవద్దని నేను చెబుతున్నా..1

By:  Tupaki Desk   |   23 Aug 2015 11:14 AM GMT
లాక్కోవద్దు..లాక్కోవద్దని నేను చెబుతున్నా..1
X
ఏపీ రాజధాని ప్రాంతంలో పవన్ బహిరంగ ప్రసంగం పూర్తి అయ్యింది. పవన్ వచ్చి ఏం చేస్తాడు? ఏం మాట్లాడతాడు? ఏపీ సర్కారుకు ఏం చెబుతాడు? గొడవ పడతాడా? బంధాలు తెంచుకుంటాడా? ఏపీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తాడా? ఎన్నికల సమయంలో తాను దగ్గరుండి ఓట్లు వేయించిన పార్టీపై దుయ్యబడతాడా? ఇలా ఎన్నో సందేహాలు చాలామంది మదిలో మెదులుతున్న పరిస్థితి.

పవన్ ప్రసంగాన్ని తెలుగుదేశం నేతలు చాలామందే టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి ఉంటారు. ఒకవేళ చూసే వీల్లేకపోతే.. కచ్ఛితంగా వివరాల్ని అడిగి తెలుసుకోవటం ఖాయం. అత్యంత కీలకమైన భూసేకరణపై పవన్ తదుపరి అడుగు ఏమిటన్నది తేలే పర్యటన కావటంతో.. అద్యంతం ఆసక్తి వ్యక్తమైంది.

దీనికి తగ్గట్లే రాజధాని ప్రాంతంలో పర్యటించిన పవన్.. చాలావరకు సందేహాల్నితీర్చేస్తాడు. రాజకీయ నాయకులు రోటీన్ గా చెప్పే త్యాగాలు చేయాలన్న మాటకు బదులుగా..త్యాగాలు ఎందుకు చేయాలన్న ప్రశ్నను సంధించిన ఆయన.. ప్రజల త్యాగాలతో వచ్చే రాజధాని అవసరం లేదన్న మాటను చెప్పకనే చెప్పేశాడు.

మిత్రపక్షంగా ఉండటం అంటే కట్టుబానిసలా పడి ఉండటం కాదంటూ బాబుకు ఎక్కడో తగిలే మాటను బుల్లెట్ ఉపయోగించిన పవన్.. మిత్ర ధర్మంలో రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉండే వారి పనిలో జోక్యం కల్పించుకోవటం ఎంతో తప్పన్న విషయాన్ని చెప్పి.. రిమోట్ కంట్రోల్ మాదిరిగా ఉండటం సబబు కాదని తేల్చేశారు.

తాను రాజకీయ నాయకుడ్ని కాదని స్పష్టంగా చెప్పిన ఆయన.. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తాను రాజకీయాల్లోకి రావటం జరిగిందే తప్పించి... ముఖానికి రంగేసుకోవటం.. రాజకీయాలు నడపటం తనకేమాత్రం ఇష్టం ఉండదని.. హాయిగా వ్యవసాయం చేసుకోవటంలో ఉన్నంత సుఖం మరి దేన్లోను లేదన్న ఆయన.. ప్రజల పక్షాన పోరాడేందుకు ఎంతకైనా రెఢీ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు.

తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్య మనసును సైతం గాయపరిచి ప్రజల పక్షాన నిలబడిన తనకు.. చంద్రబాబుతో బంధం తెంచుకోవటం అంత పెద్ద విషయం కాదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. రైతుల కోసం తాను వచ్చింది సినిమా నటుడిగానో.. రాజకీయ నాయకుడిగానో కాదని.. ఒక రైతుగా వచ్చానని చెప్పిన పవన్ కల్యాణ్.. ఏపీ సర్కారుతో గొడవ పెట్టుకోవటం ఐదు నిమిషాల పని అని.. అది తనకు ఏ మాత్రం ఇష్టం లేదన్నాడు.

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని.. చేసే వ్యాఖ్యల విషయంలో ఆచితూచి మాట్లాడాలన్న విషయాన్ని చెప్పిన పవన్.. ఈ సందర్భంగా నాలుగైదు ఉదంతాల్ని ప్రస్తావించారు.

భూసేకరణ విషయంలో ఏపీ సర్కారు మరోసారి ఆలోచించాలంటూ.. తానెంతో మర్యాదపూర్వకంగా ట్వీట్ చేస్తే.. యనమల చేసిన వ్యంగ్య వ్యాఖ్యతో పాటు.. మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ.. అఫ్టరాల్ 3500 ఎకరాలంటూ చేసిన వ్యాఖ్యను తీవ్రంగా తప్పు పట్టారు. అంతేకాదు.. ఎంపీ గల్లా జయదేవ్ ఆ మధ్య ఒంగోలులో మాట్లాడుతూ.. కొన్నింటి కోసం కొన్ని త్యాగాలు తప్పవని చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టిన పవన్.. టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

నటుడు మురళీ మోహన్ కు చాలా డబ్బుందని.. ఎంత ఉందో తెలీదు కానీ.. చాలా ఉందని మాత్రం తెలుసన్నపవన్.. అంత డబ్బున్న మురళీ మోహన్ కు చెందిన పది ఎకరాల భూమి.. వైఎస్ హయాంలో ఔటర్ రింగురోడ్డు కోసం పోతే.. సుప్రీంకోర్టు వరకూ వెళ్లారని.. భూమి పోతుంటే ఎంత బాధ ఉంటుందన్నది మురళీమోహన్ లాంటి నేతలకు తెలుసని.. కావాలంటే ఆయన్ను.. భూసేకరణ చేయాలనుకుంటున్న ప్రాంతాల్లో పర్యటించేలా చేయాలని ఆయన సూచించారు. అదే విధంగా ఎంపీ గల్లా జయదేవ్ ను కూడా పర్యటించాలని పిలుపునిచ్చారు.