Begin typing your search above and press return to search.

తెగ పొగిడేశారు... మిత్రుడు నొచ్చుకోడా...?

By:  Tupaki Desk   |   17 Feb 2022 9:05 AM GMT
తెగ పొగిడేశారు... మిత్రుడు నొచ్చుకోడా...?
X
అదేంటో బీజేపీ జనసేనల మధ్యన పొత్తు ఉన్నా కూడా చాలా విషయాల్లో భిన్నమైన దారులే కనిపిస్తాయి. ఏపీ తెలంగాణాలలో పవన్ చరిష్మాను ఉపయోగించుకుని మంచి ఫలితాలు రాబట్టాలని బీజేపీ చూస్తోంది. అయితే తెలంగాణా వరకూ చూస్తే పవన్ కేసీయార్ ని బాగా ఆరాధిస్తూంటారు. అది ఆయన మాటలలో అనేకసార్లు అది వ్యక్తమైంది. కొన్నేళ్ళ క్రితం అయితే ఆవేశంలో కేసీయార్ మీద కొన్ని హాట్ కామెంట్స్ చేసినా పవన్ ఆ తరువాత నుంచి మాత్రం బాగానే ఉంటున్నారు.

వీలు దొరికితే ఆయన్ని మెచ్చుకోకుండా పవన్ ఉండరు. ఇపుడు కేసీయార్ పుట్టిన రోజు రూపంలో అలాంటి సందర్భం వచ్చింది. అంతే పవన్ కేసీయార్ కి జస్ట్ జన్మ దిన శుభాకాంక్షలు మాత్రమే తెలియచేయకుండా చాలానే రాసుకొచ్చారు. కేసీయార్ రాజకీయ పోరాట యోధుడు అని అభివర్ణించారు. ఆయన తెలంగాణాను సాధించి చరిత్ర సృష్టించారని కొనియాడారు.

ఆయనకు ఉన్న వాగ్దాటి కానీ, ముందు చూపు కానీ ఎన్నతగినవి అని పవన్ కితాబులు ఇచ్చారు. ఎంతటి జఠిల సమస్య ఎదురైనా తనదైన వాక్చాతుర్యంతో కేసీయార్ దాన్ని సానుకూలం చేస్తారని, ప్రజలకు స్వాంతన చేకూరుస్తారని కూడా పేర్కొన్నారు.

ఇక సమకాలీన రాజకీయ నేతలలో కేసీయార్ ది ఒక ప్రత్యేక శైలి అని కూడా అభివర్ణించారు. తెలంగాణాలో శాంతి భద్రతలను కాపాడుతున్న తీరు కానీ ఆయన రాజకీయ శైలి కానీ మెచ్చతగినవి అన్నారు. మొత్తానికి కేసీయార్ కోసం చాలానే మాటలు వాడారు, తెలుగు భాషలో ఉన్న విశేషణాలు కూడా గట్టిగా ఉపయోగించారు.

నిజానికి కేసీయార్ పుట్టిన రోజున రాజకీయాలకు అతీతంగా అందరూ కంగ్రాట్స్ చెప్పారు. కానీ పవన్ మాత్రం చాలానే రాసుకొచ్చారు. మరి పవన్ కళ్యాణ్ ఇంతలా కేసీయార్ ని పొగిడితే ఆయన్ని అధికార పీఠం నుంచి దించేయడానికి అక్కడ అహరహం శ్రమిస్తున్న బీజేపీ మిత్రుడు నొచ్చుకోడా అన్నదే ఇక్కడ పాయింట్. అంతే కాదు తాజాగా ఏపీ నుంచి సోము వీర్రాజు కూడా కేసీయార్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాడన్ జోస్యం చెప్పారు. ఆయనది కుటుంబ పాలన, అవినీతి పాలన అని తూర్పారా పట్టారు.

మరి పవన్ కళ్యాణ్ కి కేసీయార్ పాలనలోని అవినీతి కుటుంబ వారసత్వాలు ఏవీ కనిపించలేదా అన్నదే బీజేపీలో చర్చగా ఉంది మరి. ఏది ఏమైనా కేసీయార్ ని ఇంతలా పొగిడిన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాక తెలంగాణా బీజేపీకి ఏ సాయం చేయలేదు. పైగా మోడీని దేశం నుంచి తరిమికొడతామన్న కేసీయార్ హాట్ కామెంట్స్ ని కూడా పక్కన పెట్టేసినట్లుగా ఈ అభినందనలతో కూడిన పొగడ్తలు ఉన్నాయంటే బీజేపీ మిత్రులు జనసేనాని పోకడల మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.