Begin typing your search above and press return to search.

ఆరంభానికే అభినంద‌న‌లు ఏంది ప‌వ‌న్ సార్‌!

By:  Tupaki Desk   |   2 Jan 2018 7:38 AM GMT
ఆరంభానికే అభినంద‌న‌లు ఏంది ప‌వ‌న్ సార్‌!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌లిసేందుకు వెళ్లిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. ఎవ‌రైనా స‌రే.. త‌న‌ను క‌లిసేలా చేయ‌టం.. త‌న అవ‌స‌రాన్ని గుర్తించేలా చేస్తూ వ‌చ్చిన ప‌వ‌న్‌.. తాజాగా అందుకు భిన్నంగా కేసీఆర్ ఇంటికి త‌న‌కు తానే వెళ్ల‌టం.. గంట‌పాటు వెయిట్ చేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంత‌కీ కేసీఆర్ ను ప‌వ‌న్ ఎందుకు భేటీ అయ్యారు?.. ఉన్న‌ట్లుండి కేసీఆర్‌ ను క‌ల‌వాల‌న్న ఆలోచ‌న ప‌వ‌న్ ఎందుకు చేశారు? అన్న దానిపై ప‌వ‌న్ ఏం చెప్పారో చూస్తే.. పొద్దుపొద్దున్నే పేప‌ర్ చూడ‌గానే ఆశ్చ‌ర్య‌మ‌నిపించింద‌ని.. అన్ని ప‌త్రిక‌ల్లో కేసీఆర్ స‌ర్కారు ఇచ్చిన ప్ర‌క‌ట‌న చూడ‌గానే.. తెలంగాణ ప్ర‌భుత్వం ఎంత సాధించింద‌న్న విష‌యం అర్థ‌మై గ్రేట్ అనిపించింద‌ని చెప్పుకొచ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

అంతేనా.. విభ‌జ‌న వేళ‌లో తెలంగాణ విడిపోతే క‌రెంటు కష్టాల మీద త‌న‌కు చాలా సందేహాలు ఉండేవ‌ని.. అలాంటి వాటిని మూడున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో చ‌టుక్కున తీర్చేసిన వైనం విస్మ‌యానికి గురి చేయ‌ట‌మే కాదు.. ఆశ్చ‌ర్యంతో అవాక్కు అయ్యేలా చేసింద‌ని.. ఇంత అద్భుతం సాధించిన కేసీఆర్‌ను అర్జెంట్ గా అభినందించాల్సి ఉంద‌ని.. దేశ వ్యాప్తంగా ఈ విధానాన్ని అమ‌లు చేయాల‌ని బ‌డాబ‌డా చాలానే మాట‌లు చెప్పేసుకొచ్చారు.

ప‌వ‌న్ మాట‌ల్ని.. అచ్చ‌య్యే అన్ని వార్త‌ల్లా చ‌దివితే పెద్ద‌గా ఏమీ అనిపించ‌దు. కానీ.. కాస్త బుర్ర‌కు ప‌దును పెట్టి ప‌వ‌న్ చెప్పే ప్ర‌తి మాట‌ను ఆచితూచి అన్న‌ట్లు చ‌దివితే.. చాలా కొత్త విష‌యాలు అర్థం కావ‌ట‌మే కాదు.. ఎంత‌కూ స‌మాధానం దొర‌క‌ని సందేహాలు సైతం మ‌న‌సుకు వ‌చ్చేస్తాయి.

అలా వ‌చ్చిన డౌట్ల‌లో కొన్నింటిని చూస్తే..

+ కేసీఆర్ ఇచ్చిన భారీ ప్ర‌క‌ట‌న‌ల‌తో రైతుల‌కు 24 గంట‌ల ఉచిత విద్యుత్ అన్న విష‌యం ప‌వ‌న్‌కు తెలియ‌టం ఏమిటి? ఈ ప‌థ‌కం గురించి గ‌డిచిన కొద్దిరోజులుగా మీడియాలో హ‌డావుడి అవుతోంది క‌దా? అదేమీ ప‌వ‌న్ దృష్టికి రాలేదా?

+ రైతుల‌కు 24 గంట‌ల ఉచిత విద్యుత్ అన్న‌ది నిన్న‌టి నుంచి స్టార్ట్ అయిన స‌రికొత్త ప‌థ‌కం. రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయ‌టానికి ముందు.. పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాల్లో అమ‌లు చేశారు. దీని లోటుపాట్ల గురించి స‌మాచారం పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు. రేపు అమ‌లు అయ్యాక‌.. అస‌లు స‌మ‌స్య‌లు తెర మీద‌కు వ‌చ్చే వీలుంది.

+ ఒక పథ‌కం స‌క్సెస్ అయ్యిందా? లేదా ? అన్న‌ది ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని అమ‌లు చేసి.. కొన్ని రోజులు గ‌డిస్తే కొత్త స‌మ‌స్య‌లు.. ఇబ్బందులు ఎదురు కాకుండా.. ఈ ప‌థ‌కం కార‌ణంగా తెలంగాణ వ్యాప్తంగా రైతులు లాభ ప‌డితే.. ప‌థ‌కం స‌క్సెస్ అయిన‌ట్లు. అంటే.. ఇందుకు క‌నీసం స‌మ‌యం కొంత ప‌డుతుంది. అది ఆర్నెల్లు అయితే న్యాయ స‌మ్మ‌తంగా ఉంటుంది. కానీ.. ప‌థ‌కం ప్రారంభించిన రోజే అద్భుత‌మంటూ వ్యాఖ్యానించ‌టం అంటే.. సినిమా ఫ‌స్ట్ షో వేసినంత‌నే సూప‌ర్ హిట్ అంటూ హ‌డావుడి చేయ‌టం మాదిరి ఉంటుంది. ప‌థ‌కం ప్రారంభించిన రోజే అద్భుత‌మ‌ని పొగిడేయ‌టం స‌రికాద‌న్న చిన్న విష‌యం ప‌వ‌న్‌కు తెలీదా?

+ కేస్ స్ట‌డీ చేయాల‌న్న‌ప్పుడు దానికి సంబంధించిన ప్రాధ‌మిక స‌మాచారం కోసం సీఎం ద‌గ్గ‌ర‌కు వెళతారా? లేక‌.. ఆ రంగానికి సంబంధించిన నిపుణుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి.. అందులోని లోటుపాట్ల‌ను బేరీజు వేస్తారా? ఒక‌వేళ‌.. తాను కానీ ఆ ఎక్స‌ర్ సైజ్ చేసి ఉంటే.. ఆ విష‌యాన్ని ప‌వ‌న్ చెప్పారు. కానీ.. మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ప‌వ‌న్ చెప్పిందేమిటంటే.. తానో కేస్ స్ట‌డీ కోస‌మ‌న్న‌ట్లు ముఖ్య‌మంత్రిని క‌లిసిన‌ట్లు చెప్పారు. కేస్ స్టడీకి అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని నిపుణుల ద‌గ్గ‌ర సేక‌రిస్తారా? సీఎం ద‌గ్గరా?