Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ తో ఆ పార్టీల నేత‌ల భేటీ చూశారా?

By:  Tupaki Desk   |   1 Aug 2017 12:10 PM GMT
ప‌వ‌న్‌ తో ఆ పార్టీల నేత‌ల భేటీ చూశారా?
X
టాలీవుడ్ స్టార్ హీరో - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మొన్న‌టి విశాఖ ప‌ర్య‌ట‌న ఇటు ఏపీలోనే కాకుండా అటు తెలంగాణ‌లోనూ ఆస‌క్తిని రేకెత్తించింది. పార్టీ పెట్టి ఇప్ప‌టికే మూడేళ్లు దాటిపోతున్నా... ఇంకా పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రాలేని ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగానైనా దీనిపై ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న వ‌స్తుందా? రాదా? అన్న కోణంలో ఆలోచించించిన జ‌న‌మంతా ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ ప‌ర్య‌ట‌న‌పైనే దృష్టి సారించారు. రాజ‌కీయాల మాట ఎలా ఉన్నా... శ్రీ‌కాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్థుల స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న స్పందించిన తీరు నిజంగానే ఆస‌క్తి క‌లిగించింది. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత హార్వర్డ్ వ‌ర్సిటీకి చెందిన శాస్త్ర‌వేత్త‌ల బృందం ప‌వ‌న్ చొర‌వ కార‌ణంగానే ఉద్దానంలో ప‌ర్య‌టించి వ్యాధి మూలాల‌ను నిగ్గు తేల్చేందుకు న‌డుం బిగించింది. మొన్న శాస్త్ర‌వేత్త‌ల‌తో భేటీ అయిన ప‌వ‌న్ అక్క‌డే ఉద్దానంతో పాటు తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పైనా మాట్లాడారు. ఈ మాట‌లు రొటీన్‌ కు కాస్తంత భిన్నంగానే వినిపించినా... పెద్ద‌గా మెరుపులేమీ లేవ‌ని చెప్పాలి.

స‌రే రాజ‌కీయాలు ఎలా ఉన్నా.. ఉద్దానంపై ప‌వ‌న్ స్పందించిన తీరు బాగుంద‌ని జ‌నం అనుకున్నారు. ఆ త‌ర్వాత విశాఖ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని నిన్న ఉదయం విజ‌య‌వాడ బ‌య‌లుదేరేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు ప‌వ‌న్ చేరుకున్న సంద‌ర్భంగా ఓ అరుదైన స‌న్నివేశం క‌నిపించింది. ఏపీలోని అధికార పార్టీ టీడీపీ - ఆ పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ - ఏపీ అసెంబ్లీలోని ఒకే ఒక్క ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీకి చెందిన నేత‌లు ప‌వ‌న్‌ తో ఒకేసారి భేటీ అయ్యారు. భేటీ అంటే... ఏదో గ‌దిలో కూర్చుని ర‌హ‌స్య మంత‌నాలు సాగించార‌ని చెప్ప‌లేం గానీ... ప‌వ‌న్‌ తో క‌లిసి ఆ మూడు పార్టీల నేత‌లు ఏకంగా మీడియా కెమెరాల‌కు చ‌క్క‌టి ఫోజిచ్చారు. అయినా ప‌వ‌న్ తో క‌లిసిన ఆయా పార్టీల నేత‌లెవ‌రు? వారు ప‌వ‌న్‌ ను ఎందుకు క‌లిశారు? అన్న విష‌యాల‌ను ప‌రిశీలిస్తే... నిన్న ఉద‌యం విజ‌య‌వాడ వ‌చ్చేందుకు విమానం ఎక్కేందుకు విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. విమానం కోసం ఆయ‌న లాంజ్ లో కూర్చుకున్నారు.

అదే స‌మ‌యంలో అదే విమానంలో విజ‌య‌వాడ వ‌చ్చేందుకు బీజేపీ ఎమ్మెల్యే - ఏపీ శాస‌న స‌భ‌లో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అక్క‌డికి వ‌చ్చారు. అంత‌కు కాసేప‌టి క్రిత‌మే ఢిల్లీ వెళ్లేందుకు టీడీపీ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు ఎయిర్ పోర్టుకు వ‌చ్చారు. ప‌వ‌న్‌ ను చూసి ఆయ‌న‌తో మాట క‌లిపారు. ఇక మ‌రికాసేప‌టికే హైద‌రాబాదు వెళ్లేందుకు వైసీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు - ఆ పార్టీ యువ నేత గుడివాడ అమ‌ర్ నాథ్ కూడా ఎయిర్ పోర్టుకు వ‌చ్చారు. తొలుత ప‌వ‌న్‌తో మాట క‌లిపిన ముత్తంశెట్టి... అక్క‌డికి వ‌చ్చిన త‌న జిల్లాకు చెందిన రాజ‌కీయ నేతలు విష్ణుకుమార్ రాజు, గుడివాడ అమ‌ర్ నాథ్ ల‌ను ఆయ‌న ప‌వ‌న్‌ కు ప‌రిచ‌యం చేశారు. సినీ స్టార్ గా రాష్ట్రంలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న ప‌వ‌న్ తో చేయి క‌లిపేందుకు ఎవ‌రికి మాత్రం ఆస‌క్తి ఉండ‌దు చెప్పండి... ఇదే కార‌ణమో, లేక ఇంకేదో తెలియదు గానీ.... ముత్తంశెట్టి పిల‌వ‌గానే విష్ణుతో పాటు అమ‌ర్ కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న‌తో చేయి క‌లిపారు. దీనిని గ‌మ‌నించిన మీడియా కెమెరాలు సిద్ధం చేసుకోగానే... ప‌వ‌న్ తో క‌లిసి ఆ మూడు పార్టీల నేత‌లు... మొత్తంగా నాలుగు పార్టీల‌కు చెందిన నేత‌లు ఫోజిచ్చారు. మ‌రి ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య ఏవైనా రాజ‌కీయ అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయో, లేదో తెలియ‌రాలేదు.