Begin typing your search above and press return to search.

పవన్ : కొండంత రాగం తీసి లొల్లాయి పాటా?

By:  Tupaki Desk   |   16 March 2018 4:23 PM GMT
పవన్ : కొండంత రాగం తీసి లొల్లాయి పాటా?
X
తెలుగుదేశం వీర బీభత్సంగా రంకెలు వేసి - అటు కేంద్రాన్ని ఓ పట్టు పట్టి - ఇటు వైకాపాను తూలనాడి.. అన్నీ చేసిన పవన్.. చివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామమాత్రపు రాజకీయ అస్తిత్వం కూడా లేని వామపక్షాలతో జతకట్టడం చిత్రంగా పలువురు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ తొలి నుంచి సభల నాడు ఉండే మూడ్ కు.. ఆ తర్వాత వ్యవహరిస్తున్న వ్యూహాలకు చాలా తేడా కనబరుస్తూనే వస్తున్నారు.

ప్రతి విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. ప్రత్యేకహోదా కోసం నినదించినా పోరాడుతా అని చెప్పినా.. ఆ తర్వాత.. నెమ్మదిగా ఆ డిమాండ్లను సైడ్ లైన్ చేసినా.. అంతా ఒకే పద్ధతిలో చేశారు. ఇన్నాళ్లూ తెలుగుదేశంతో అంటకాగుతూ వచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం చేశారు. లోకేష్ మీద విమర్శల దాడితో.. తన సొంత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తపన పడుతున్నారు.

మొత్తానికి పవన్ కల్యాణ్ తెలుగుదేశం నీడలో మగ్గిపోని ఒక స్వతంత్ర రాజకీయ వ్యవస్థగా ఆవిర్భవించాలని అనుకుంటున్నారు. అంతవరకు అంతా సమంజసంగానే ఉంది. కానీ.. అందుకు ఆయన అనుసరిస్తున్న విధానాలే చిత్రంగా ఉన్నాయి.

2019 ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ఎన్నికల సమారంగణంలోకి దిగి.. అమీ తుమీ తేల్చేయాలని.. అంతా అనుకూలిస్తే.. అధికారంలోకి వచ్చేయాలని పవన్ కోరిక. ఆ సంకేతాలను మొన్నటి సభలోనే ఇచ్చారు. అయితే..అంత లావు లక్ష్యం పెట్టుకున్న వ్యక్తి.. ఇక ఏడాది మాత్రమే గడువున్న సమయంలో వ్యవస్థాగత నిర్మాణం మీద - బూత్ కమిటీల వరకు పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టాలి. ఆ విషయంలో తన లోపాలను సమర్థించుకుంటూ ఆయన ఇప్పుడు వామపక్షాలతో జట్టు కట్టారు.

లెఫ్ట్ పార్టీలకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అస్తిత్వం అప్పుడప్పుడూ పోరాటాలు చేయడం వరకు మాత్రమే పరిమితం.. ఓట్లు - సీట్లు గెలవగల సత్తా వారికి లేదు. ఆ క్షేత్రస్థాయి వాస్తవాల్ని గుర్తించకుండా.. పవన్.. ఈ ఎత్తుగడతో ఎందుకు వెళ్తున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడినట్లుగా అధికారంలో ఉన్న - పెద్ద పార్టీలు అన్నిటినీ తెగ తిట్టి... అసలు సోదిలో లేని వారితో జతకట్టడం చిత్రమే అని పలువురు అంటున్నారు.