Begin typing your search above and press return to search.

గోదారి దారి : మార్పు రావాల్సిందే అంటున్న పవన్

By:  Tupaki Desk   |   17 July 2022 1:30 AM GMT
గోదారి దారి : మార్పు రావాల్సిందే అంటున్న పవన్
X
గోదావరి జిల్లాలను జనసేనాని గట్టిగా టార్గెట్ చేశారు. మండపేట మీటింగులో ఆయన చెప్పిన మాటలు చూస్తే ఉభయ గోదావరి జిల్లాల మీద జనసేన గంపెడాశలు పెట్టుకున్నట్లుగా అర్ధమవుతోంది. పదే పదే పవన్ ఈ జిల్లాలు చైతన్యవంతమైన జిల్లాలు అని చెప్పుకొచ్చారు. ఈసారి జనసేన వైపు మీరు నిలబడాలి అని ఆయన కోరారు.

గోదావరి జిల్లాలు మారితే ఆ ప్రభావం కడప జిల్లా పులివెందుల దాకా కనీస్తుంది అంటూ జగన్ని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు. తాను ముద్దుపు పెట్టనని, మాయ మాటలు చెప్పనని చెబుతూనే తన మీద నమ్మకం ఉంచితే కచ్చితంగా జనసేనకు ఓటేసి గెలిపించాలని పవన్ కోరారు.

ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలలో జనసేనకు బలం ఉందని తెలిసే కోనసీమలో కుల చిచ్చు రేపారని పవన్ చెప్పడమూ విశేషం. ఇక గోదావరి జిల్లాల వారు తలచుకుంటే ఏమైనా చేయగలరు అని కూడా ఆయన ఉత్సాహపరచారు. తాను సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నానని, తన వ్యక్తిత్వాన్ని గమనించి మద్దతు ఇవ్వాలని ఆయన కోరుకున్నారు.

ఇదిలా ఉంటే ఒక పద్ధతి ప్రకారమే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలను ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఇక్కడ మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఒక బలమైన సామాజిక వర్గం ఇక్కడ ఉంది. జనసేనకు ఆ వర్గం అండగా ఉంటోందన్న నివేదికలు ఉన్నాయి.

దాంతో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఒక మంచి నంబర్ ని సాధించాలి అంటే గోదావరి జిల్లాలే రాజకీయ దారి చూపిస్తాయన్న వ్యూహంతోనే పవన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే టైమ్ లో ఏపీలో ముప్పయి నుంచి నలభై సీట్లు జనసేన సాధించి హంగ్ వస్తే మాత్రం కచ్చితంగా జనసేనకు సీఎం చాన్స్ ఏదో రూపంలో వస్తుంది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తే కనుక గోదవారి జిల్లాల‌ మీద జనసేన మరింతగా ముందు ముందు దృష్టి పెడుతుంది అని కూడా భావించవచ్చు.

ఇక పవన్ మరో మాట కూడా అన్నారు. గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో తాను పోటీ చేస్తే గెలిచేవాడిని అని, అయినా తనకు కులాలు ప్రాంతాలు లేవు ఏపీ అంతా ఒక్కటే అని భావించానని చెప్పుకున్నారు. ఈసారి మాత్రం పవన్ తూర్పు గోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తాను అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.