Begin typing your search above and press return to search.

మోడీతో పవన్ భేటీకి వైసీపీ మార్క్ ప్రచారం మొదలైందిగా?

By:  Tupaki Desk   |   12 Nov 2022 5:11 AM GMT
మోడీతో పవన్ భేటీకి వైసీపీ మార్క్ ప్రచారం మొదలైందిగా?
X
గుడ్డు మీద ఈకలు పీకినట్లుగా కొందరు మాట్లాడుతుంటారు. విషయం ఏమీ లేకున్నా.. ఏదో ఉన్నట్లుగా వారి తీరు ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీలోని అధికారపక్షానికి చెందిన కరుడు కట్టిన అభిమాన గణంలో కనిపిస్తోందంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రోజువారీగా టార్గెట్ చేస్తూ.. ఆయనేం చేసినా అందులో ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపుతూ.. ఆయన పని అయిపోయిందన్నట్లుగా ప్రచారం చేసే బ్యాచ్.. సరికొత్త ప్రచారానికి తెర తీసింది.

విశాఖకు వచ్చిన ప్రధాని మోడీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పిలిపించి మాట్లాడటం.. దాదాపు వారి భేటీ నలభై నిమిషాలు సాగటం తెలిసిందే. ప్రధాని మోడీతో భేటీ తర్వాత బయటకు వచ్చిన పవన్ మీడియాతో మాట్లాడారు.

ఆ సందర్భంగా ఆయన ఆచితూచి అన్నట్లుగా మాట్లాడారు. ప్రధానితో జరిగిన భేటీ భవిష్యత్తులో ఏపీకి ప్రయోజనం కలిగిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుందన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పవన్ ముఖాన్ని చూపిస్తూ.. వైసీపీ అభిమాన గణం కొత్త ప్రచారానికి తెర తీసింది. మోడీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంలో పవన్ ముఖం మాడిపోయిందని.. ఆయనకు మోడీ క్లాస్ పీకారంటూ తమకు తోచిన ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఒకవేళ.. నిజంగానే పవన్ ను క్లాస్ పీకాలన్నదే ఉద్దేశం అయితే.. ప్రధాని మంత్రి మోడీ రెండు రోజులు ముందే తన కార్యాలయం వారి చేత ఫోన్ చేసి మరీ తనను కలవమని చెప్పరు కదా? నిజానికి మోడీ తలుచుకుంటే పవన్ కు క్లాస్ పీకటానికి పిలిపించుకునే చేయాలా? చేయాల్సిన విధంగా చేస్తే సరిపోదా?

ఈ దుష్ప్రచారం ఇలా సాగుతుండగా.. ప్రధాని మోడీని కలిసిన సీఎం జగన్ ను ఉద్దేశించి.. నవ్వుతూ ఉన్న ఫోటోల్ను పోస్టు చేస్తూ కొత్త విశ్లేషణలకు శ్రీకారం చుట్టారు. ఈ తీరు ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ రెండు అంశాల్ని ప్రస్తావిస్తూ జనసేన వారు రంగంలోకి దిగారు.

సీఎం జగన్ జైల్లో ఉన్నప్పుడు.. విచారణ కోసం కోర్టు కు వెళ్లే సమయంలోనూ చేతులు జోడించి..నవ్వుతూ బయటకు వెళ్లేవారని.. అంటే.. నవ్వు హ్యాపీగా ఉన్నానని చెప్పేందుకు సంకేతమా? అని ప్రశ్నిస్తున్నారు. జగన్ నవ్వుతుంటే ఆనందంగా ఉన్నట్లు.. పవన్ గంభీరంగా ఉంటే క్లాస్ పీకినట్లు? అంటూ చేస్తున్న ప్రచారం చూస్తే.. వైసీపీ మద్దతుదారుల మైండ్ సెట్ ఎలా ఉంటుందన్నది ఇట్టే అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.