Begin typing your search above and press return to search.

జగన్ పరిహారంపై ప్రశ్నించిన పవన్

By:  Tupaki Desk   |   14 April 2022 9:30 AM GMT
జగన్ పరిహారంపై ప్రశ్నించిన పవన్
X
ఏపీ సీఎం జగన్ పరిహారంపై జనసేనాని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రమాదాన్ని బట్టి పరిహారమా? అని నిలదీశారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అత్యంత బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయిన ఘటన ఏపీలో తీవ్ర విషాదం నింపిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్.. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ స్పందించి నిలదీశారు.

ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఇవ్వడమేంటని పవన్ ప్రశ్నించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి న్యాయబద్దంగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని.. అధికార యంత్రాంగం భద్రతా ప్రమాణాలపై నిరంతరం తనిఖీలు చేసి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు.

ఇక అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుసైతం డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను సోము వీర్రాజు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

అగ్నిప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమైనదని అన్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డి గూడెం లో ఉన్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో బుదవారం రాత్రి గ్యాస్ లీకేజీతో భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. పోరస్ ఫ్యాక్టరీలోని ప్రమాద సమయంలో విధుల్లో 17మంది కార్మికులు ఉన్నారు. ఘటన స్థలంలోనే ఐదుగురు సజీవ దహనం కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.