Begin typing your search above and press return to search.

పరిషత్ ఎన్నికల్లో సీట్లు తగ్గటానికి కారణం చెప్పిన పవన్

By:  Tupaki Desk   |   24 Sep 2021 6:30 AM GMT
పరిషత్ ఎన్నికల్లో సీట్లు తగ్గటానికి కారణం చెప్పిన పవన్
X
అనుకున్న దాని కంటే మిన్నగా.. అంచనాలకు భిన్నంగా పరిషత్ ఎన్నికల ఫలితాల్లో జనసేన గౌరవప్రదమైన స్థానాల్లో ఎంపీటీసీ స్థానాల్ని.. రెండు జెడ్పీటీసీ స్థానాల్నిసొంతం చేసుకున్నారు. దీంతో.. ఇప్పటివరకు తన ఉనికిని చాటుకునేందుకు సరైన వేదిక లభించలేదన్న వేదనతో ఉన్న పవన్ కు తాజా పరిషత్ ఎన్నికలు భారీ ఊరటను ఇచ్చాయని చెప్పాలి. దీంతో.. మరింత దూకుడుగా వెళితే.. మరిన్ని సీట్లను సొంతం చేసుకునే వీలు ఉంటుందన్న భావనలో జనసేన ఉంది.

పరిషత్ ఫలితాలపై రెండు రోజుల క్రితం పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేదని.. మరింత లోతుగా అధ్యయనం చేయటం ద్వారా ఫలితాల్ని విశ్లేషిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించటం తెలిసిందే. తమకు వచ్చిన ఫలితాలు.. తాము ఎదుర్కొన్న పరిస్థితులు.. గెలిచే అవకాశం ఉన్నా ఓటమి పాలైన అంశాలపైనా ఆయన సమీక్షలు చేస్తున్నారు. తాజాగా ఆయన అధ్యయనం ముగిసినట్లుగా కనిపిస్తోంది. పరిషత్ ఫలితాలపై తాజాగా ఆయన మాట్లాడారు. ఏపీ అధికార పక్షంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తమకు రావాల్సిన సీట్లను వైసీపీ నేతలు అడ్డుకున్నారని.. ఈ కారణంతోనే తమకు రావాల్సినన్ని సీట్లు రాలేదన్నారు. వైసీపీది దౌర్భాగ్యపు.. దిక్కుమాలిన.. దాష్టీక పాలన అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మండిపడ్డారు. పార్టీ అధినేత మొదలు పార్టీ నేతలంతా ఒకేలా ఉన్నారన్న పవన్.. పలు చోట్ల తాము గెలవాల్సి ఉన్నప్పటికీ.. అక్కడి అధికార పార్టీ నేతలు వ్యవహరించిన తీరుతో విజయాన్ని మిస్ అయినట్లుగా చెబుతున్నారు. అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా పలు చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాలే కానీ తమ పార్టీ విజయం తథ్యమన్న ధీమాను వ్యక్తం చేశారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ బలంగా పోరాడి తాము 25.2 శాతం ఓట్లను సాధించినట్లుగా చెప్పిన పవన్ కల్యాణ్.. వైసీపీ దాష్టీకాల్ని ప్రదర్శించి చాలా చోట్ల ఫలితాల్ని ప్రభావితం చేసి పదవుల్ని సొంతం చేసుకున్నారన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో తాము పలు స్థానాల్ని సొంతం చేసుకున్నామన్నారు. జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా మారుతోందన్నారు. వైసీపీ దాష్టీక పాలనను ఎదుర్కోవాలని తాము బలంగా అనుకున్నట్లు చెప్పారు.

పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన నేతల్ని ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు.. దాడులకు పాల్పడటం లాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా జనసేన నేతలు.. కార్యకర్తలు.. అభ్యర్థులు బలంగా నిలిచారన్నారు. ‘‘ ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమై.. పంచాయితీ ఎన్నికల్లో 1209 సర్పంచ్ లు.. 15765 ఉప సర్పంచ్ లు.. 4456 వార్డు సభ్యులు గెలిచాం. పరిషత్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. 1200 స్థానాలకు 177 స్థానాల్ని సొంతం చేసుకున్నాం. పంచాయితీ ఎన్నికల్లో దాదాపు 24 శాతం పైచిలుకు ఓట్ల శాతాన్ని సాధిస్తే.. పరిషత్ ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాలు గొప్ప మార్పునకు సూచనగా భావిస్తున్నా’’ అని పవన్ పేర్కొన్నారు.

ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయకపోతే పింఛన్ నిలిపేస్తాం, రేషన్ కట్ చేయిస్తాం, ఇళ్ల స్థలాలు నిలిపివేస్తామంటూ వలంటీర్లతో బెదిరించారని.. ఈ కారణంగా ఫలితాల మీద ప్రభావం పడిందన్నారు. అంతేకాదు.. ఇతర పార్టీల అభ్యర్థుల ఆర్థిక మూలలపై దాడి చేశారని ఆరోపణలు సంధించారు. మరికొన్నిచోట్ల స్వయంగా మంత్రులే ఎన్నికల ప్రక్రియను నడిపించినా.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ ఉండిపోయిందని విమర్శించారు.

‘‘పొత్తులో భాగంగా మిత్రపక్షమైన బీజేపీకి కొన్ని స్థానాలు కేటాయించాం. దానివల్ల కూడా జనసేనకు కొద్దిగా ఎంపీటీసీ సీట్లు తగ్గాయి. లేదంటే ఇంకాస్త ఎక్కువ స్థానాలే వచ్చేవి. అన్ని చోట్ల ఎంపీటీసీ అభ్యర్థులు బరిలో లేకపోవడం.. జెడ్పీటీసీ అభ్యర్థులకు ప్రతికూలంగా మారింది. అలాగే ఎన్నికల నాటికి జనసేన పూర్తిస్థాయి కమిటీలు లేకపోవడం కూడా లోటుగా అనిపించింది. పోలీసులే బలవంతంగా విత్‌డ్రా చేయించారు’’ అంటూ మండిపడ్డారు.

ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలయ్యే నాటి పరిస్థితులకు.. ఇప్పటి పరిస్థితులకు సంబంధం లేదని.. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే జనసేన పార్టీకి 1500 పైచిలుకు ఎంపీటీసీ స్థానాలు.. 40 నుంచి 80 మధ్యలో జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకునేదన్న పవన్ కల్యాణ్.. తమకు ఎక్కువ సీట్లు సాధించలేకపోవటానికి కారణాన్ని చెప్పుకొచ్చారు. తమ అభ్యర్థులకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని.. సామాన్యులని చెప్పారు. అలాంటి వారు ఎన్నికల బరిలోకి దిగి గెలుపొందటం ఆనందాన్ని ఇచ్చిందన్న పవన్ కల్యాణ్.. జనసైనికులు.. వీర మహిళలు లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదని పేర్కొనటం గమనార్హం.