Begin typing your search above and press return to search.

పవన్ షణ్ముఖ వ్యూహం : జగన్నే గెలిపిస్తుందా...?

By:  Tupaki Desk   |   19 July 2022 2:30 AM GMT
పవన్ షణ్ముఖ వ్యూహం : జగన్నే గెలిపిస్తుందా...?
X
తన దగ్గర షణ్ముఖ వ్యూహం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గట్టిగానే ప్రకటించారు. ఆయన ఈ వ్యూహాన్ని జనసేన జనాలకు పరిచయం చేసింది ఆవిర్భావ సభలో. ఆరు సూత్రాలను నమ్ముకుని జనసేన వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతోంది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఏపీలో ఉన్న అయిదు కోట్ల మంది ఆశలు ఆకాంక్షలు ఈ ఆరు సూత్రాలలోనే నిక్షిప్తం చేసి ప్రయోగిస్తామని కూడా చెబుతున్నారు.

అయితే జనసేన చెబుతున్న షణ్ముఖ వ్వూహం అధికార వైసీపీ మీద ఎంత వరకూ పనిచేస్తుంది, అదే టైమ్ లో టీడీపీని అధికారంలోకి రాకుండా చూస్తుందా లేక జనసేనకు అందలం దక్కిస్తుందా అన్న చర్చ బయల్దేరింది. ఇప్పటికి అందిన సమాచారం బట్టి చూస్తే షణ్ముఖ వ్యూహం ద్వారా తమదైన శైలిలో సంక్షేమ పధకాలను పెద్ద ఎత్తున ప్రకటించడం ద్వారా ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీలకు ధీటుగా తాము కూడా రేసులో నిలబడాలని జనసేన భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

జనసేన గోదావరి జిల్లాలను పూర్తిగా టార్గెట్ చేస్తోంది. ఇక్కడ 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అదే విధంగా ఉత్తరంధ్రా మీద దృష్టి పెడుతోంది. ఇక్కడ మరో 34 సీట్లు ఉన్నాయి. గుంటూరు, క్రిష్ణా జిల్లాలలో కూడా కొంత బలం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ఇలా తీసుకుంటే కచ్చితంగా నలభై సీట్లను తానుగా సొంతంగా తెచ్చుకోవాలని చూస్తోంది.

ఆ విధంగా చేస్తే వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని కూడా లెక్కలు కడుతోంది. మొదట కింగ్ మేకర్ గా ఉంటే ఆనక కింగ్ కూడా కావచ్చు అన్నదే జనసేన ఆలోచన. అజెండా కూడా. అయితే ఈ షణ్ముఖ వ్యూహంలో జనసేన పొత్తుల గురించి పెద్దగా మాట్లాడడంలేదు. పవన్ మండపేట మీటింగులో చెప్పినది కూడా జనసేన అధికారంలోకి తానుగా రావాలనే.

జనసేన తరఫున నిలబడే అభ్యర్ధులను చూడకుండా పవన్ని చూసి మాత్రమే ఓటు వేయాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే పవన్ లెక్కలు బాగా ఉన్నాయి. అధికారం కోసం ఎంచుకున్న మార్గం కూడా బాగానే ఉంది కానీ ఈ షణ్ముఖ వ్యూహం అధికార వైసీపీ మీద సరిగ్గా ప్రయోగించకపోతే దాని ప్రభావం విపక్ష శిబిరం మీద గట్టిగా పడితే అపుడు సంగతేంటి అన్నదే చర్చగా ఉంది.

గోదావరి జిల్లాలలో జనసేన బాగానే పుంజుకుంది. ఈ విషయంలో రెండవ మాటకు ఏ మాత్రం అవకాశం లేదు అన్నది అంటున్నారు. అయితే ఈ బలం సొంతంగా గెలిచేందుకు సరిపోతుందా అన్నదే ప్రశ్నగా ఉంది. ఉదాహరణకు గతంలో చాలా నియోజకవర్గాలలో పాతిక వేల దాకా జనసేనకు ఓట్లు పడ్డాయి. ఇపుడు ఆ సంఖ్య ఇంకా పెరిగి ముప్పయి నుంచి నలభై వేల దాకా ఓట్లు పెరగవచ్చు. అంతమాత్రం చేత రెండు లక్షల మధి ఓటర్లు ఉన్న చోట ఈ నంబర్ ఏమి సరిపోతుంది అన్నదే చూడాలని అంటున్నారు.

గెలవడానికి కచ్చితంగా డెబ్బై వేల ఓట్లు రావాలని అంటున్నారు. ట్రయాంగిల్ ఎంతలా ఉన్నా గెలుపునకు అవసరం అయిన నంబర్ ఇదే అని చెబుతున్నారు. ఇక పిఠాపురంలో చూస్తే జనసేనకు అనుకూల గాలి ఉంది అంటున్నారు. కానీ అక్కడ జనసేన ఇంచార్జి శేషుకుమారికి మాత్రం అది కలసివచ్చేలా కనిపించడంలేదు. పవన్ కళ్యాణ్ అయితే కళ్ళుమూసుకుని గెలిపిస్తామని జనాలు చెబుతున్నారు.

అలాగే మండపేటలో కూడా జనసేనకు మంచి ఊపు ఉంది. కానీ ఆ పార్టీ క్యాండిడేట్లు ఎంతవరకూ లాక్కు రాగలరు అన్నది కూడా చర్చగా ఉంది. వాళ్ళు పార్టీని గెలుపు తీరాలకు చేరకపోతే చీల్చేవి భారీగా టీడీపీ ఓట్లే అవుతాయి. అపుడు తక్కువలో తక్కువ ఓట్లతో వైసీపీ గెలిచినా గెలుస్తుంది అని కూడా అంటున్నారు. మరి ఒంటరిగా జనసేన పోటీ చేసి నలభై సీట్లు సాధించాలి అంటే ఈ రెండేళ్ల తక్కువ సమయం ఏ కోశానా సరిపోదు అనే అంటున్నారు.

జనసేన ఒంటరిగా పోటీ చేయడం కంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తానికి మొత్తం పొలిటికల్ సీన్ మారుతుందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. అలాగే దాని ప్రభావం అటు ఉత్తరాంధ్రాతో పాటు ఇటు దక్షిణ కోస్తా మీద పడి జనసేన టీడీపీ సర్కార్ ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది అని కూడా విశ్లేషిస్తున్నారు. అయితే పవన్ మాత్రం పొత్తుల గురించి మండపేట సభలో మాట్లాడకపోవడంతో కొత్త చర్చ బయలుదేరింది.

ఈసారి జనసేన ఒంటరిగా పోటీ చేస్తే తాను అనుకున్న షణ్ముఖ వ్యూహం ఎంత వరకూ సక్సెస్ అవుతుంది అన్నదే ఆలోచించాలని అంటున్నారు. ఇపుడు జనసేన ఇలా మాట్లాడినా చివరి నిముషంలో పొత్తులు ఉండవచ్చు అని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. రెండు పార్టీల మధ్యన పొత్తులు కనుక లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుందని, చివరికి అది జగన్ కి మరో చాన్స్ ఇచ్చినా ఇవ్వవచ్చు అని అంటున్నారు.