Begin typing your search above and press return to search.

తెలంగాణ రాజ‌కీయాల‌పై ప‌వ‌న్ సైలెంట్.. మ‌రి వ్యూహ‌మేంటి?

By:  Tupaki Desk   |   31 Oct 2022 11:30 AM GMT
తెలంగాణ రాజ‌కీయాల‌పై ప‌వ‌న్ సైలెంట్.. మ‌రి వ్యూహ‌మేంటి?
X
దాదాపు ఎక్క‌డ ఏం జ‌రిగినా ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష‌ణం. అక్కడ అలా జ‌రిగింది.. ఇక్క‌డ ఎందుకు జ‌ర‌గ‌డం లేదు.. అని ఆయ‌న ప్ర‌స్తావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా సాధించే విష‌యంపై ఆయ‌న తొలుత న‌డుం బిగించారు. కానీ, త‌ర్వాత వ‌దిలేశారు. అయితే, త‌ర్వాత ఆయ‌న దీనిని తెలంగాణ ఉద్య‌మానికి ముడిపెట్టి స‌మ‌ర్ధించుకున్నారు. అక్క‌డ ఫైర్ ఉంది.. ఇక్క‌డ లేదు.. అందుకే వ‌దిలేశాన‌ని చెప్పారు. ఇప్ప‌టికైనా ఎవ‌రై ఉంటే క‌లిసి వ‌స్తే పోరాటం చేస్తాన‌ని కూడా రెండేళ్ల కింద‌టే వ్యాఖ్యానించారు.

ఇక‌, ఇటీవ‌ల కూడా తెలంగాణ విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు. ఏపీలో త‌ర‌చుగా వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న ప‌వ‌న్ విష‌యం ఏదైనా వ‌స్తే దానికి తెలంగాణ‌కు లింకు ఉంటే ఖ‌చ్చితంగా ప్ర‌స్తావిస్తున్నారు. అయితే, తాజాగా ఆయ‌న మంగ‌ళ‌గిరిలో నిర్వ‌హించిన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌మావేశంలో తెలంగాణ స‌హా దేశాన్ని కుదిపేసిన ఎమ్మెల్యేల కొనుగోళ్లు/ ఫిరాయింపుల విష‌యంపై మాత్రం ప‌వ‌న్ ప‌న్నెత్తు మాట మాట్లాడ‌లేదు. అనేక విష‌యాలు ప్ర‌స్తావించారు. కానీ, దీనిపై మాత్రం ప‌వ‌న్ నోరెత్త‌లేదు. అస‌లు ఏమీ తెలియ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు.

అయితే.. ప‌వ‌న్ ఎందుకు మాట్లాడాలి. వైసీపీ మాట్లాడిందా? టీడీపీ మాట్లాడిందా? అనే చ‌ర్చ రావొచ్చు. ఎందుకంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లోప‌వ‌న్ తెలంగాణ లో పోటీ చేస్తాన‌ని చెప్పారు. ఏడా ప‌ద్నాలుగా అంటూ త‌న పార్టీ వారినే ప్ర‌శ్నించారు. ఎన్ని కోరుకుంటే అన్ని స్థానాల్లోనూ తెలంగాణ నుంచి ఈ సారి పోటీ ఉంటుంద‌ని చెప్పారు. అంతేకాదు కొండ‌గ‌ట్టు నుంచి త‌న రాజ‌కీయ ప్ర‌యాణం ప్రారంభ‌మ‌వుతుంద‌ని కూడా వెల్ల‌డించారు. అంటే తెలంగాణ‌లో యాక్టివ్ అవుతున్న నాయ‌కుడిగా ప‌వ‌న్ స్పందించాల‌నేది ప‌రిశీల‌కుల భావ‌న‌.

ఇక‌, ఇక్క‌డ మ‌రో విష‌యం కూడా ఉంది. ఫిరాయింపుల కేసును చూస్తే, ప‌వ‌న్ కూడా బాధితుడే. ఆయ‌న పార్టీ జ‌న‌సేన త‌ర‌ఫున 2019లో రాజోలు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌ను వైసీపీ లాగేసుకుంది. సో దీనిని బ‌ట్టి జ‌న‌సేన కూడా ఫిరాయింపుల బాధిత పార్టీగానే ప‌రిగ‌ణించాలి.

ఈ రెండు కార‌ణాల నేప‌థ్యంలో అయినా ప‌వ‌న్ స్పందించి ఉండాలి. కానీ, ఆయ‌న మౌనంగా ఉన్నారు. అస‌లు విష‌యాన్నే ప్ర‌స్తావించ‌లేదు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో రాజ‌కీయ కొట్లాట‌కుదిగిన రెండు పార్టీలు బీజేపీ-టీఆర్ ఎస్ లు ప‌వ‌న్‌కు కావాల్సిన పార్టీలు కాబ‌ట్టే మాట్లాడ‌లేద‌నే విశ్లేష‌ణ ఉంది. మ‌రి దీనిపై ప‌వ‌న్ ఎప్పుడు రియాక్ట్ అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.