Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఇంటికి పవన్.. ఈసారి ఎందుకలా జరిగింది?

By:  Tupaki Desk   |   9 Jan 2023 11:30 AM GMT
చంద్రబాబు ఇంటికి పవన్.. ఈసారి ఎందుకలా జరిగింది?
X
సుదీర్ఘ ప్రయాణం సైతం ఒక అడుగుతోనే మొదలవుతుంది. కల కనగానే సరిపోదు. కార్యాచరణ చాలా ముఖ్యం. ఆ విషయం తెలీనంత అమాయకుడు కాదు పవన్ కల్యాణ్. అదే సమయంలో తనకున్న పరిమితులను దాటుకుంటూ.. తన పరిధిని విస్త్రతం చేసుకోవటం ఆయనలో ఈ మధ్యన కనిపిస్తున్న కొత్త కోణంగా చెప్పాలి. తన సోదరుడు చిరంజీవి రాజకీయంగా చేసిన తప్పుల్ని రిపీట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పవన్.. ప్రతి అడుగును ఆచితూచి అన్నట్లుగా వేస్తున్నట్లుగా చెప్పాలి.

అధికారం చేతికి రావాలన్నదే లక్ష్యమైనప్పటికి అదేమీ అంత తేలికైన విషయం కాదన్న సత్యం 2019 ఎన్నికల ఫలితాలతో పవన్ కు బాగానే అర్థమైందని చెబుతారు. తనకు పదవుల మీద ఆశ లేదన్న ఆయన.. 2019 ఎన్నికలకు కాస్త ముందుగా ఆయన మాటల్ని జాగ్రత్తగా చూసినప్పుడు సీఎం పీఠం మీద కూర్చోవాలన్న ఆత్రుత కనిపించింది. కోరిక ఉండగానే సరిపోదు. దానికి తగినట్లుగా ఎత్తుగడ ఉండాలి. ఆటగాళ్లు ఉండాలి. అప్పుడు మాత్రమే ఆట అనుకున్న ఫలితాన్ని ఇస్తుందన్న విషయం ఆయనకు ఎదురైన ఘోర ఓటమితో అర్థమైందంటున్నారు.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన వెంటనే.. ప్రధాన మీడియా సంస్థలు మొదలు కొని మిగిలిన వారు సైతం ఎవరికి వారు వారికితోచిన విశ్లేషణలు చేసుకుంటూ పోయారు. కొందరు ఏకంగా ఎవరికెన్ని సీట్లు అన్న దానిపైనా తమ జోస్యాల్ని చెప్పేశారు. అయితే.. ఈ ఇరువురు అగ్రనేతలకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారు మాత్రం.. వారి తాజా భేటీ వెనుక లెక్కలు వేరుగా ఉన్నాయన్న మాట చెబుతుండటం గమనార్హం.

కాస్త అటుఇటుగా సంబంధం కలుపుకోవాలన్న విషయంపై క్లారిటీ వచ్చేసిన వేళ.. అనవసరమైన విషయాలను ఇప్పుడే ప్రస్తావించటం ద్వారా విషయం పక్కదారి పడుతుందన్నది ఇరువురు అగ్రనేతలకు తెలుసని చెబుతున్నారు. ఇలాంటి వాటి కోసమే ఎదురుచూసే జగన్ అండ్ కో.. తాము పొత్తు రాజకీయాల మీద చిన్న వ్యాఖ్య చేసినా ఆ వెంటనే విషపు ప్రచారాన్ని షురూ చేయటానికి సిద్ధంగా ఉందన్న విషయం వారికి తెలియంది కాదు.

అందుకే.. పొత్తులు.. ఎన్నికల రాజకీయాల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ఉండటమే మంచిదన్న ఆలోచనలో ఇద్దరు అగ్రనేతలు ఉన్నట్లుగా చెబుతున్నారు. గడిచిన మూడున్నరేళ్లుగా భయం అన్నది లేని అధికారపక్షంలో తొలిసారి బెదురు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న వేళ.. ఆ బెదురును మరింతగా పెంచటం మీదనే ఫోకస్ చేయాలన్నట్లుగా వారి ఎత్తుగడ ఉందని తెలుస్తోంది. తాజా భేటీ అంశాన్నే చూస్తే.. సుదీర్ఘకాలం మిత్రులుగా అడుగులు వేయాల్సిన వేళ.. కొన్ని కీలక సమయాల్లో ఇరువురి మధ్య ఈ తరహా కలయిక అవసరమన్న విషయంపై ఏకాభిప్రాయం కారణంగానే తాజా భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది.

విశాఖ పర్యటన సందర్భంగా పవన్ పై అధికారపక్షం చేసిన దాడి.. ఆపై పవన్ కు ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో బెజవాడకు తిరిగి రావాల్సి రావటం తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు తనకు తానే చొరవ తీసుకొని పవన్ తో భేటీ కోసం సందేశాన్ని పంపటం.. తానే కలుస్తానన్న మాట పవన్ కు భారీ ఊరటగా చెబుతున్నారు. బాబు నుంచి వచ్చిన సందేశానికి సానుకూలంగా రియాక్టు అయిన పవన్ కారణంగా నాడు భేటీ జరిగింది.

విశాఖలో పవన్ ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నారో.. తాజాగా తన కుప్పం పర్యటనలో చంద్రబాబు ఆ తరహా పరిణామాల్ని ఎదుర్కొన్న వేళ.. అప్పట్లో తనకు నైతిక మద్దతు ఇచ్చి.. తమ స్నేహ హస్తాన్ని చాటిన చంద్రబాబుకు.. తాజాగా పవన్ అంతే స్నేహాన్ని తిరిగి ఇచ్చారని చెబుతున్నారు. దాదాపుగా పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఒక సీనియర్ నేత.. ఒక పార్టీ అధినేత విషయంలో జగన్ సర్కార్ అనుసరించిన వైఖరిని తాను తీవ్రంగా ఖండిస్తున్నన్న విషయాన్ని ప్రకటనతో కంటే కూడా సొంతంగా భేటీ కావటం ద్వారా.. తాను ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుందన్న పవన్ ఆలోచనతోనే టీడీపీ అధినేత ఇంటికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. కీలక వేళల్లో ఇద్దరు అధినేతలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కలుస్తూ.. భేటీ కావటం ద్వారా రాబోయే రోజుల్లో మరింత చొరవగా విషయాల్ని చర్చించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇలా భవిష్యత్ అంచనాలతోనే తాజాగా భేటీ సాకారమైందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.