Begin typing your search above and press return to search.

పవన్ సైతం : మోడీ అమిత్ షాలతో భేటీ కోసం...?

By:  Tupaki Desk   |   3 Jun 2022 10:30 AM GMT
పవన్ సైతం : మోడీ అమిత్ షాలతో భేటీ కోసం...?
X
జగన్ గత రెండు నెలల వ్యవధిలో మూడు సార్లు ఢిల్లీ టూర్ చేశారు. మూడు సార్లూ కూడా ఆయన ప్రధాని మోడీ అమిత్ షాలతో సమావేశం అయ్యారు. వారితో ఏం చర్చించారు, ఏపీకి ఏ రకమైన నిధులను తెచ్చారు అన్నది పక్కన పెడితే రాజకీయంగా మాత్రం వైసీపీకి ఈ భేటీలు ఉపయోగపడుతున్నాయని అంటున్నారు.

ఏపీలో టీడీపీ, జనసేనలతో బీజేపీని కలవనీయకూడదు అన్నది వైసీపీ ఎత్తుగడ. ఆ రెండు పార్టీలు కలసినా బీజేపీ కనుక దూరంగా ఉంటే కధ వేరుగా ఉంటుందని భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు ఎన్నికల వేళ చాలా కీలకం. అంగబలం, అర్ధబలం కలగలసిన ఎన్నికలు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా కలుపుకుని పోవాలని టీడీపీ అధినాయకత్వం చూస్తోంది.

ఇక పవన్ సైతం బీజేపీ చెలిమి వీడకపోవడానికి కారణం కూడా ఇదే. కేంద్రంలో ఉన్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్న అంచనాలు ఉన్న క్రమంలో బీజేపీని తమ వైపు రప్పించుకోవాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ఇక జనసేనాని మానసికంగా టీడీపీతో కలసివెళ్ళేందుకు సిద్ధపడినట్లుగా చెబుతున్నారు.

ఏపీలో ఎట్టిపరిస్థితులలో వైసీపీని ఈసారి అధికారం నుంచి దించాలన్నది పవన్ పట్టుదలగా ఉంది. ఆ విషయంలో బీజేపీని కూడా తమ వెంట తీసుకెళ్ళాలని ఆయన చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన త్వరలో ఢిల్లీ టూర్ కి ప్లాన్ చేసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలవాలని పవన్ చూస్తున్నారు.

ఆ ఇద్దరి అపాయింట్లమెంట్ల కోసం ప్రస్తుతం జనసేన ప్రయత్నాలు చేస్తోంది అని తెలుస్తోంది. అపాయింట్మెంట్లు రాగానే పవన్ రెక్కలు కట్టుకుని ఢిల్లీకి వచ్చి వాలతారు అని అంటున్నారు. ఢిల్లీలో పవన్ మోడీ, అమిత్ షాలను కలసి ఏపీలో సాగుతున్న అరాచక పాలన, వైసీపీ మీద ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఇవన్నీ పూసగుచ్చినట్లుగా వివరిస్తారు అని తెలుస్తోంది. అదే విధంగా ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతల విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తారని అంటున్నారు.

అదే విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు సాగుతున్నాయని ఆయన కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తారని అంతున్నారు. ఇక చివరాఖరుగా ఏపీ భవిష్యత్తు దృష్ట్యా టీడెపీఎ బీజేపీ, జనసేన కలసి వెళ్లాలని అది చారిత్రక అవసరం అని పవన్ కేంద్ర బీజేపీ పెద్దలకు వివరిస్తారు అని అంటున్నారు.

ఈ మూడు పార్టీలు కనుక కలిస్తే ఏపీలో కచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన నమ్ముతున్న విషయాన్ని, దానికి సంబంధించి తనకు అందుబాటులో ఉన్నవివిధ సర్వేల నివేదికలను కేంద్ర పెద్దలకు అందచేస్తారు అని అంటున్నారు. మొత్తానికి మోడీ షా అపాయింట్మెంట్ల కోసం జనసేన ఎదురుచూస్తోంది. ఒక్కసారి కనుక పవన్ కేంద్ర పెద్దలను కలిస్తే ఏపీ రాజకీయాల్లో టోటల్ గా మార్పు వస్తుంది అని అంటున్నారు.

వైసీపీని ఓడించాలన్న పవన్ ఆలోచనలను బీజేపీ అధినాయకత్వానికి వివరించడం ద్వారా వారిని ఒప్పించగలను అన్న నమ్మకాన్ని పవన్ వ్యక్తం చేస్తున్నారుట. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరోమారు గెలవడానికి అవసరమైన ఎంపీ సీట్లు ఏపీ నుంచి కూడా ఈ కూటమి ఏర్పాటు తో వస్తాయని పవన్ చెప్పనున్నారుట. మరి పవన్ ఢిల్లీ వెళ్లాలీ అంటే కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ అవసరం. అది వారు ఇస్తారా. ఇస్తే కనుక వైసీపీకి గుండెలల్లో రైళ్ళు పరిగెట్టినట్లే అనుకోవాలి.