Begin typing your search above and press return to search.

వైసీపీ కార్యకర్తలకు పవన్ వార్నింగ్...

By:  Tupaki Desk   |   4 Dec 2020 1:58 PM GMT
వైసీపీ కార్యకర్తలకు పవన్ వార్నింగ్...
X
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ కొంతకాలంగా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సందర్భాన్ని బట్టి ట్వీట్లు, మీడియా ప్రకటనలు మినహా...కరోనా నేపథ్యం కావచ్చు...షూటింగుల్లో బిజీగా ఉండడం కావచ్చు...ఈ మధ్య కాలంలో ప్రజల్లో పవన్ పర్యటించిన దాఖలాలు లేవు. ఇటీవల జనంలోకి వస్తోన్న పవన్ లో మునుపటి ఆవేశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నివర్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుక పవన్ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో పవన్ పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించారు. ఈ నేపథ్యంలో పవన్ ....గతంలో మాదిరిగా వీరావేశంతో ఊగిపోయి వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. తన పర్యటనను అడ్డుకోవాలని చూస్తే...వైసీపీ కార్యకర్తలపై ప్రతిదాడి చేసేందుకు జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రైతుల కోసం చేస్తోన్న తన పర్యటనను అడ్డుకోవాలనుకోవడం సరికాదని పవన్ ఆవేశపడ్డారు.

నివర్ తుపాను ధాటికి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35వేల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అత్యవసరంగా కనీసం రూ.10వేల సాయం అందించాలని కోరారు. రైతాంగాన్ని పరామర్శించేందుకు వచ్చిన తనను అడ్డుకోవడం సరికాదని, తన పర్యటనకు అడ్డుకోవాలని చూసే వైసీపీ కార్యకర్తలపై ప్రతిదాడి చేసేందుకు జనసేన కార్యకర్తలు సిద్ధమని అన్నారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం లేదని, కొంతమంది పోలీసులు వైసీపీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని పవన్ ఆరోపించారు. తాను కూడా పోలీస్ కుటుంబం నుండి వచ్చానని...పోలీసుల తీరు మారకుంటే తనను ఇబ్బంది పెట్టిన పోలీసులను పేరు పేరునా గుర్తుపెట్టుకుంటానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ వైసీపీ నేతల జాగీరు కాదని... నెల్లూరు జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని పవన్ అన్నారు. మరి, పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, కార్యకర్తలను రెచ్చగొట్టేలా పవన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కార్యకర్తలు ఆవేశపడితే పార్టీ అధినేత స్థాయిలో వారికి నచ్చజెప్పి శాంతింపచేయాల్సిన పవన్...ఇలా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.