Begin typing your search above and press return to search.

తమ్ముళ్ల నోట 'చెప్పు దెబ్బ' మాట.. వైసీపీ నేతలకు కొత్త ఇబ్బందేనట

By:  Tupaki Desk   |   20 Jan 2023 11:30 AM GMT
తమ్ముళ్ల నోట చెప్పు దెబ్బ మాట.. వైసీపీ నేతలకు కొత్త ఇబ్బందేనట
X
వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ట్రెండ్ సెట్ చేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా. సినిమాల్లో తన సత్తాను ఇప్పటికే చాటిన ఆయన..రాజకీయాల్లో తానేమిటో ఫ్రూవ్ చేసుకోవాలన్న కసిగా ఉన్నట్లు చెబుతారు. ఎలాంటివి ఆశించకుండా.. ప్రజలకుసేవ చేయాలన్న తపన ఎక్కువగా ఉన్న ఆయన.. తన మనసులోని మాటను ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయటం.. వివిధ విషయాల మీద నిజాయితీగా మాట్లాడటం పవన్ కల్యాణ్ కున్న బలంగా చెప్పాలి.

ఈ మధ్యన తన పార్టీ నేతలతో మాట్లాడే కార్యక్రమాన్ని మీడియా కవర్ చేస్తుండగా.. మూడు పెళ్లి వ్యవహారంపైనా.. ప్యాకేజీ స్టార్ అన్న మాటలపైనా తీవ్రంగా రియాక్టు అయిన పవన్.. అలాంటి మాటలు తనను అంటే.. చెప్పు తీసుకొని ఎడాపెడా వాయిస్తానంటూ సంచలన వార్నింగ్ ఇవ్వటం.. ఆ మాట ఏపీ రాజకీయాల్లో ఎంతటి దుమారాన్ని రేపిందో తెలిసిందే.

వైసీపీ నేతల తొండి ఆటకు పవన్ లాంటి వారే సరిగ్గా సరిపోతారన్న మాట తరచూ వినిపిస్తోంది. ఎవరినైనా సరే లెక్క చేయకుండా.. వెనుకా ముందు మాట్లాడేసే వైసీపీ నేతలకు పవన్ గురించి మాట్లాడేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. పవన్ నోటి నుంచి వచ్చిన మాటనే తాజాగా తెలుగు తమ్ముళ్లు వల్లె వేయటం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలకు వైసీపీ దిగితే.. ఆ పార్టీ నేతలకు చెప్పు దెబ్బ రుచి చూపిస్తామని టీడీపీ తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు.

తాము చెప్పిన మాటల్ని చేతల్లో చేసి చూపిస్తామన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు వ్యవహరించటం గమనార్హం. ఎమ్మెల్సీ అశోక్ బాబు.. దళిత విభాగం అధ్యక్షుడు ఎంఎస్ రాజులు కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో వైసీపీ సోషల్ మీడియా పేజీలను చెప్పుకో కొట్టే వైనాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కందుకూరు ఉదంతంలో టీడీపీ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయన్న తప్పుడు ప్రచారాన్ని వైసీపీ నేతలు చేస్తున్నారని పేర్కొన్న తెలుగు తమ్ముళ్లు.. వారి సోషల్ మీడియా పేజీని చెప్పుతో కొట్టిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కాబోయే మిత్రుడి మాటను తెలుగుతమ్ముళ్లు తమదైన శైలిలో వాడేసుకోవటానికి మించిన మంచి పని ఇంకేం ఉందన్న మాట వినిపిస్తోంది. కాబోయే మిత్రుల మధ్య ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోవటాలు తప్పేం కాదని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.