Begin typing your search above and press return to search.

చాణక్యుడుకి సవాల్ : అటు జగన్.. ఇటు పవన్...?

By:  Tupaki Desk   |   16 July 2022 2:30 AM GMT
చాణక్యుడుకి సవాల్ : అటు జగన్.. ఇటు పవన్...?
X
రోజులు ఎపుడూ ఒక్కలా ఉండవు. తాడు కూడా పాము అవుతుంది ఒక్కోసారి. విషయానికి వస్తే చంద్రబాబు చురుకైన రాజకీయ నేత. ఈ మాట ఎవరూ వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 1970 మధ్య నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సవాళ్ళను సంక్షోభాలను ఆయన చాకచక్యంగా తన చాణక్య రాజకీయంతో విప్పుకుంటూ తప్పుకుంటూ విజయ సోపానాలను ఎక్కిన మేటి, ఘనాపాటి. అలాంటి చంద్రబాబు రాజకీయ చరమాంకంలో ఉన్నారు. ఆయన ఇపుడు పడుతున్న వేదన, వత్తిడి బహుశా టోటల్ పొలిటికల్ కెరీర్ లో ఎన్నడూ పడలేదు అని చెప్పాలి.

చంద్రబాబు ఎన్నో ఎన్నికలను చూసిన ఆరితేరిన యోధుడు. కానీ 2024 జరిగేవి మాత్రం ఆయనకు ఏ మాత్రం అర్ధం కాని ఎన్నికలు అని చెప్పవచ్చు. దానికి కారణం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒక వైపు ఉంటే మరో వైపు చంద్రబాబు వయోభారం, ఇంకో వైపు ఏపీలో ఇద్దరు యువ నాయకులు ఆయనకు గట్టి సవాల్ గా మారుతున్నారు. వారిలో ఒకరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆయనతో బాబు ఇప్పటికి కొన్ని ఉప ఎన్నికలను, రెండు సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేసి ఉన్నారు. జనారల్ ఎలక్షన్స్ లో ఒకటి బాబు గెలిస్తే ఒకటి జగన్ గెలిచారు.

అయితే 2019 ఎన్నికల్లో ఓటమి బాబుని ఆయన ధీమాను కూడా దెబ్బ తీసిందని చెబుతారు. ఏకంగా 23 సీట్లకు ఆయన పార్టీ పడిపోయింది. మరో వైపు వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. మూడేళ్ల పాలన ముగిసింది వైసీపీ గ్రాఫ్ తగ్గుతోంది అని అంటున్నారు కానీ టీడీపీ గ్రాఫ్ పెరిగింది అన్నది మాత్రం ఎవరూ చెప్పడంలేదు. ఇక టీడీపీ సభలక్ జనాలు అయితే వస్తున్నారు. వారు తుదికంటా ఉంటారా. అసలు వచ్చిన వారు ఓట్లేసే జనాలేనా. చివరి నిముషంలో ఏం జరుగుతుంది అన్న‌ది కూడా అర్ధం కానీ విషయం.

మరో వైపు దేనికైనా తెగించే గుణం జగన్ ది. ఆయనతో పోరు ఏకైక ఎంపీగా ఆయన ఉన్నప్పటి నుంచే బాబు మొదలెట్టారు. నాటి కంటే నేడు అన్ని విధాలుగా ఆరితేరి ఈ రోజున అధికారం బలంతో జగన్ ఉన్నారు. మరో వైపు వచ్చే ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డడానికి వైసీపీ ఫుల్ ప్రిపేర్ అయి ఉంది. దాంతో వైసీపీని జగన్ని ఏ మాత్రం లైట్ తీసుకునే సీన్ అయితే లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే జయం అంటూ ఏ నివేదిక వచ్చినా ఏ సర్వే చూసినా ధీమా పడాల్సినది కూడా లేదు. ఎందుకంటే ఈసారి ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. ఎలా జరుగుతాయో రిజల్ట్ ఎలా వస్తుందో ఆఖరి ఓటు లెక్కించే వరకూ తెలియదు అని అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్. ఆయన మిత్రుడా లేక ప్రత్యర్ధా అన్నది కూడా బాబుకే కాదు టీడీపీకే అర్ధం కాని పరిస్థితి. 2014 నాటి పవన్ మాత్రం కాదు అని మాత్రం బాగా అర్ధమవుతోంది. ఆయనకు ఏవో కొన్ని సీట్లు ఇచ్చి పొత్తులు పెట్టుకుని సీఎం సీటు ఎక్కేద్దామాంటే ఈసారి ససేమిరా కుదరదు అని పవన్ చెప్పేస్తున్నారు. ఆయన అధికారంలో వాటా కోరుతున్నారు. ఇక ఆయన సినీ గ్లామర్ సామాజిక వర్గం బలం, యూత్ ఫాలోయింగ్ ఇవన్నీ కూడా పొత్తుల వైపు టీడీపీని ఆకట్టుకునేలా చేస్తూంటే అక్కడ పెట్టే కండిషన్లు మాత్రం ఇబ్బందికరంగా ఉన్నాయి.

ఇన్నేళ్ల టీడీపీ దశాబ్దాల చరిత్ర, తనకు ఉన్న ఇమేజ్ ఇవన్నీ కూడా ధారోబోసి ఎలాగైనా టీడీపీని ఒడ్డున పడేద్దామనుకుంటే ఏ వైపునా అసలు కుదరడంలేదు అనే అంటున్నారు. ఇక జగన్ కనిపించే ప్రత్యర్ధి అయితే కనబడని ప్రత్యర్ధులు చాలా మంది ఉన్నారని బాబుకు అర్ధమవుతోంది. మొత్తానికి జనసేనతో పొత్తు అంటే అన్నీ రాజీపడాలి. దాని వల్ల లాభం చివరికి ఉంటుందా ఉండదా అన్నది తెలియదు.

అలాగే బీజేపీని తోసిరాజని ముందుకు కదులుదామన్నా కూడా అసలు కుదిరే సీన్ లేదు అనేలా సీన్ ఉంది. మొత్తానికి ఎన్నడూ లేనంత వత్తిడికి బాబు గురి అవుతున్నారు అని అంటున్నారు. అటూ ఇటూ జగన్ పవన్ యువకులుగా నిలిచి భీష్మాచార్యుడు లాంటి బాబునే సవాల్ చేస్తున్న రాజకీయం అయితే ఏపీ పాలిటిక్స్ లో ఉంది. మరి దాన్ని ఎలా డీల్ చేస్తారో. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా బాబు అన్నీ తట్టుకుని నెట్టుకుని టీడీపీని గెలిపించి సీఎం అయితే మాత్రం శభాష్ బాబు అనాల్సిందే మరి.