Begin typing your search above and press return to search.

అమలాపురం ఎపిసోడ్ పై పవన్ ‘కీ’ పాయింట్లు విన్నారా?

By:  Tupaki Desk   |   25 May 2022 12:30 PM GMT
అమలాపురం ఎపిసోడ్ పై పవన్ ‘కీ’ పాయింట్లు విన్నారా?
X
కోనసీమ జిల్లా పేరు ముందు అంబేడ్కర్ పేరును చేర్చాలన్న అంశం ఎలాంటి విపరిణామాలకు కారణమైందో తెలిసిందే. సంచలనంగా మారటమే కాదు.. ఇటీవల కాలంలో ఏపీలోనూ.. ఇటు తెలంగాణలోనూ ఇలంటి అసాధారణ పరిస్థితి చోటు చేసుకున్నది లేదు. ఈ ఉదంతంలో జనసేన పార్టీ హస్తం ఉందంటూ అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న వేళ.. మీడియా ముందుకు వచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

తమ మీద విసురుతున్న ఆరోపణలకు సమాధానాలు ఇస్తూ.. రివర్సులో ఆయన సంధించిన సందేహాలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉండటం గమనార్హం. సున్నిత అంశాల్ని సైతం ప్రస్తావిస్తూ.. దానికి సంబంధించి తన వాదనను వినిపిస్తూ.. అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి ఆయన సంధించిన ప్రశ్నలు అస్త్రాలుగా మారటమే కాదు.. కీలకమైన ‘కీ’ క్వశ్చన్లు అడిగారన్న భావన కలిగేలా చేస్తున్నాయి.

మీడియా సమావేశంలో పవన్ చేసిన కీలకమైన వ్యాఖ్యలు.. సంధించిన సూటి ప్రశ్నల్ని చూస్తే..
కీలక వ్యాఖ్యలు
- కోనసీమ ప్రాంతానికి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు పెట్టారు. జిల్లాలకు కొత్త పేర్లు పెట్టేటప్పుడు అంబేడ్కర్ పేరు కూడా పెడితే బాగుండేది. అనాడే అంబేడ్కర్ పేరు పెట్టి ఉంటే ఇవాల్టి రోజున ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.
- జిల్లాలకు పేర్లు పెట్టేటప్పుడు ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాల్సింది. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సాధారణంగా కొంత వ్యతిరేకత ఉంటుంది. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పొట్టిన శ్రీరాములును ఒక జిల్లాకు కుదించారు. ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ లాంటి వ్యక్తిని జిల్లాకు పరిమితం చేశారు.
- క్రిష్ణా నది తక్కువగా ఉన్న చోట క్రిష్ణా జిల్లా పేరు పెట్టి.. క్రిష్ణా నది ఎక్కువగా ఉన్న చోట ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు. జిల్లాల పేర్లకు వ్యతిరేకమైనా.. వ్యక్తులకు వ్యతిరేకం కాదు.

- అభ్యంతరాలపై 30 రోజులు సమయం ఇచ్చి కలెక్టరేట్ కు రావాలన్నారు. సామూహికంగా కాదు వ్యక్తిగతంగా రావాలన్నారు. ఇది ముమ్మాటికి వ్యక్తులను టార్గెట్ చేయటమే.
- ఘోరాలు ఆపలేదు కానీ.. జనసేన మీద ఆరోపణలు చేస్తూ కులసమీకరణపై రాజకీయాలు చేస్తున్నారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారు.
- మూడు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్సీ తన మాజీ డ్రైవర్ ను చంపేశారు. చంపి వాళ్ల ఇంటికే వెళ్లి డెడ్ బాడీ అప్పగిస్తారా? చనిపోయిన వ్యక్తి ఎస్సీ వ్యక్తి కావటంతో వ్యతిరేకత వచ్చింది. ప్రజలను మళ్లించేందుకే కోనసీమలో గొడవలు రేపారు.

- కులాల పేరుతో గొడవలు జరిగితే రాష్ట్ర డెవలప్ మెంట్ సాధ్యం కాదు. ప్రభుత్వం బాధ్యత వహించాలి.
- వైసీపీ నేతలు గొడవలు తగ్గించే ప్రయత్నం చేయండి. సజ్జల లాంటి పెద్దల అనుభవం కుల ఘర్షణలకు కారణం కాకూడదు.
- ప్రభుత్వ వైఫల్యాల నుంచి చూపు మళ్లించటంలో సీఎం జగన్ నేర్పరి. అమలాపురం విధ్వంసంలో కీలకంగా వ్యవహరించిన అన్నం సాయి వైసీపీ నేతనే.

సూటి ప్రశ్నలు
- జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టటంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేసింది?
- మిగితా జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ అని పేరు పెడితే సహజంగా ఉండేది. అభ్యంతరాలు ఉంటే 30 రోజులు సమయం ఇస్తున్నామన్నారు. మిగిలిన జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు టైమిచ్చారు?
- 30 రోజులు గడువు ఎందుకు ఇచ్చారు? గొడవలు జరగాలని కాదా?
- మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా?
- పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారంటే ఏమనుకోవాలి? దాడి జరుగుతుంటే ఇంటికి రక్షణగా ఉండాలి కదా?
- విశ్వరూప్ ఇంటిపై దాడికి ముందే మంత్రి కుటుంబ సభ్యుల్ని తరలించారు. అంటే.. దాడి జరుగుతుందని ముందే పోలీసులు ఊహించారా? లేదంటే వారికి ముందే తెలుసా?
- ఒకవేళ ముందే తెలిస్తే బందోబస్తు పెట్టలేదంటే ఏమనుకోవాలి?
- కోనసీమకే పేరు పెట్టటం వెనుక ప్రభుత్వ ఆలోచన ఏంటి? కడప జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టొచ్చు కదా?