Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద గెలిచినా.. లోకేష్ మీద గెలిచినా.. మాట ఇచ్చినా

By:  Tupaki Desk   |   18 April 2022 2:30 PM GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద గెలిచినా.. లోకేష్ మీద గెలిచినా.. మాట ఇచ్చినా
X
2019 ఏపీ ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యంతో జ‌గ‌న్ తొలిసారి ముఖ్య‌మంత్రి అయ్యారు. జ‌గ‌న్ ధాటికి వైసీపీ పార్టీకి ఎన్నిక‌ల్లో 151 సీట్లు వ‌చ్చాయి. అయితే ఆ ఎన్నిక‌ల్లో ఓ ముగ్గురు వైసీపీ నేత‌లు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు. తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో దిగిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.

ఇక మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, అప్ప‌టి మంత్రి లోకేశ్ కూడా ఎన్నిక‌ల్లో చిత్త‌య్యారు. దీంతో వీళ్ల‌ను ఓడించిన వైసీపీ నేత‌ల పేరు ఒక్క‌సారిగా మార్మోగింది. వాళ్ల‌కు జ‌గ‌న్ త‌న కేబినేట్లో అవ‌కాశం క‌ల్పిస్తార‌నే ప్రచారం జోరందుకుంది. కానీ రెండు సార్లు వాళ్ల‌కు మొండిచెయ్యే ఎదుర‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇస్తాన‌ని చెప్పి..

ప‌వ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం, గాజువాక నుంచి పోటీ చేశారు. భీమ‌వ‌రంలో ఆయ‌న్ని గ్రంథి శ్రీనివాస్‌, గాజువాక‌లో తిప్ప‌ల నాగిరెడ్డి ఓడించారు. ఇక మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి విజ‌యం సాధించారు. ఆ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప‌వ‌న్‌, లోకేష్‌ను ఓడించిన వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇస్తాన‌ని జ‌గ‌న్ మాట ఇచ్చార‌ని టాక్‌. కానీ అధికారంలోకి వ‌చ్చాక ఏర్పాటు చేసిన తొలి మంత్రివ‌ర్గంలో వీళ్ల ముగ్గురిలో ఒక్క‌రికీ మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు.

దీంతో జ‌గ‌న్ మాట త‌ప్పార‌ని అప్పుడు ప్ర‌జ‌లు అనుకున్నారు. క‌నీసం ఇప్పుడు మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లోనైనా వీళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నుకుంటే నిరాశే ఎదురైంది. జ‌గ‌న్ క‌నీసం వాళ్ల పేర్లు ప‌రిగ‌ణ‌లోకి కూడా తీసుకోలేద‌ని స‌మాచారం.

పాపం అంటున్న ప్ర‌జ‌లు..

ప‌వ‌న్‌, లోకేష్ లాంటి సెల‌బ్రిటీల‌ను ఓడించే నాయ‌కుల‌కు మంత్రి పదవులు ద‌క్కుతాయ‌ని.. త‌మ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి చెందుతుంద‌ని భావించిన అక్క‌డి ప్ర‌జ‌ల‌కు నిరాశే మిగిలింది. ప‌వ‌న్‌ను ఓడించిన గ్రంథి శ్రీనివాస్‌, తిప్ప‌ల నాగిరెడ్డి విష‌యంలో జ‌గ‌న్ సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌లేదు. ఇక చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌పై గెలిచిన రామ‌కృష్ణారెడ్డి విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. ఎన్నిక‌ల్లో గెలిచాక కొన్నేళ్ల పాటు సామాజిక మాధ్య‌మాల్లో హ‌డావుడి చేసిన రామ‌కృష్ణారెడ్డి ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని తెలిసింది.

మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తే ఇబ్బంది అని ఆయ‌న భావిస్తున్నార‌ని టాక్‌. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో గాజువాక నుంచి నాగిరెడ్డికి టికెట్ క‌ష్ట‌మేన‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ప‌వ‌న్‌, లోకేష్‌ను ఓడ‌గొట్టి అక్క‌డి ప్ర‌జ‌లు ఏమైనా త‌ప్పు చేశారా? అనే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి. ప‌వ‌న్ గెలిచి ఉంటే అసెంబ్లీని ఓ ఊపు ఉపేవార‌ని ఇప్పుడు అక్క‌డి జ‌నాలు అనుకుంటున్నారు. ఇక లోకేష్ విజ‌యం సాధిస్తే భ‌విష్య‌త్ మెరుగ్గా ఉండేద‌ని మంగ‌ళ‌గిరి వాసులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.