Begin typing your search above and press return to search.

కుదరదు జగన్ అంటున్న పవన్.... ?

By:  Tupaki Desk   |   17 Dec 2021 1:30 PM GMT
కుదరదు జగన్  అంటున్న పవన్.... ?
X
జగన్ తాను వినేది లే అంటున్నారు. పవన్ తగ్గేది లే అంటున్నారు. ఈ ఇద్దరు యువ నాయకుల రాజకీయ పోరు ఏపీ పాలిటిక్స్ లో హాట్ హాట్ డిస్కషన్ గా ఉందిపుడు. సుమారు రెండు నెలల నుంచి జగన్ ముందు పవన్ ఒక డిమాండ్ పెడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అఖిల పక్షాన్ని వేయమని కోరుతున్నారు. కేంద్రం పాలసీ ప్రైవేటీకరణ అయితే ఏపీకి సంబంధించినంతవరకూ రాష్ట్రప్రభుత్వం తన బాధ్యతల నుంచి ఎలా తప్పించుకుంటుంది అని పవన్ ప్రశ్నిస్తున్నారు.

కేంద్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర, అది ఏర్పాటు అయిన విధానం, దాని స్పూర్తి, వెనక ఉన్న అమరుల త్యాగాలు. వేలాది ఎకరాలు ఇచ్చిన రైతుల ఉదారత అన్నీ కూడా కేంద్రానికి తెలియచేయాల్సిన బాధ్యత, నైతికత ముఖ్యమంత్రి జగన్ మీదనే ఉంది అని పవన్ అంటున్నారు. ఈ విషయంలో మాకే బాధ్యత లేదు అని తప్పించుకుంటే కుదరదు బాస్ అంటున్నారు పవన్. ఆయన చాలా కచ్చితంగా క్లారిటీగానే చెబుతున్నారు.

స్టీల్ ప్లాంట్ కేంద్రం యాజమాన్యంలో ఉంటే రాష్ట్రం చేయాల్సింది కూడా చాలానే ఉంది అంటున్నారు. ఈ విషయంలో తొలిసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద మీటింగ్ నిర్వహించిన పవన్ ఆనాడే అఖిల పక్షం వేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక లేటెస్ట్ గా మంగళగిరి వద్ద ఒక రోజు దీక్ష చేసిన పవన్ అపుడు కూడా ఇదే డిమాండ్ వినిపించారు.

ఇపుడు మరోమారు పార్టీ శ్రేణులను కూడా కలుపుకుంటూ పోరాటానికి సిద్ధమవుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మూడు రోజుల పాటు డిజిటల్ కాంపైన్ నిర్వహిస్తున్నట్లుగా పవన్ ప్రకటించారు. ఈ మూడు రోజులలో వీలైనంత ఎక్కువగా సామాజిక మాధ్యమాలను, ఇతర సాధనాలను వాడుకుంటూ ఏపీ సర్కార్ ఉదాశీనతని ఎండగట్టేందుకు జనసైనికులు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు స్టీల్ ఇష్యూ మీద ఎందుకు నోరు విప్పరు అంటూ పవన్ గట్టిగానే నిలదీస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవ‌ద్దు అంటూ ప్ల కార్డులు పట్టుకుని 22 మంది వైసీపీ ఎంపీలు ఎందుకు ఆందోళన చేయరని పవన్ ప్రశ్నిస్తున్నారు. అదే టైమ్ లో ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్ళదు అని కూడా ఆయన నిగ్గదీస్తున్నారు. మొత్తానికి పవన్ అఖిల పక్ష నినాదం మాత్రం ఇంకా బలం పుంజుకుంటోంది. జగన్ సర్కార్ ఆ విషయాన్ని ఎంత లైట్ గా తీసుకొవాలనుకుంటే అంతకు అంత పోరు బాటలోనే ఎదురు వస్తాను అంటున్నారు పవన్. మొత్తానికి జనసైనికుల డిజిటల్ కాంపైన్ ఏ విధంగా ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది అన్నది చూడాలి.