Begin typing your search above and press return to search.

షాకింగ్.. ఆ ముఖ్య‌మంత్రిగా వ్య‌తిరేకంగా PayCM పోస్ట‌ర్లు!

By:  Tupaki Desk   |   22 Sep 2022 3:30 PM GMT
షాకింగ్.. ఆ ముఖ్య‌మంత్రిగా వ్య‌తిరేకంగా PayCM పోస్ట‌ర్లు!
X
క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బ‌స‌వ‌రాజ్ బొమ్మై ఎంపికైన‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌కు కాలం క‌ల‌సి రావ‌డం లేదు. క‌ర్ణాట‌క‌లో బీజేపీకి మూలపురుషుడు య‌డ్యూర‌ప్ప‌ను సీఎంగా తొల‌గించాక బీజేపీ అధిష్టానం య‌డ్యూర‌ప్ప సూచించిన బ‌స‌వ‌రాజ్ బొమ్మైకే ముఖ్య‌మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. అయితే ఆయ‌న‌కు సొంత పార్టీలోనే అస‌మ్మ‌తి నేత‌ల నుంచి త‌ల‌నొప్పి ఉండ‌గా ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి ఇంకా త‌ల‌పోటు ఎక్కువైంద‌ని అంటున్నారు. బొమ్మై స‌ర్కార్‌పై ప్ర‌తిపక్షాలు తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

బసవరాజ్ బొమ్మై ఫోటోతో "PayCM" శీర్షికతో కూడిన పోస్టర్‌లు బుధవారం నాడు బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో అతికించారు. అవి పేటీఎం (PayTM) డిజైన్‌ను పోలి ఉండ‌టం గ‌మ‌నార్హం. "40 శాతం ఇక్కడ అంగీకరించబడ్డాయి" అనే సందేశంతో క్యూఆర్ కోడ్ మధ్యలో సీఎం బొమ్మై ముఖాన్ని ముద్రించి PayCM పోస్ట‌ర్లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

బీజేపీ ప్ర‌భుత్వం ప‌ని ప‌నిలోనూ, కాంట్రాక్టుల్లోనూ, ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామ‌కాల్లోనూ 40 శాతం క‌మీష‌న్లు తీసుకుంటోంద‌ని ఆరోపిస్తూ కాంగ్రెస్‌, జేడీఎస్‌లు PayCM పేరిట ఇలా పోస్ట‌ర్ల‌ను అతికించార‌ని చెబుతున్నారు.

ఈ మేర‌కు గ‌త‌వారం అంటే సెప్టెంబర్ 13నే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా "40 శాతం అవినీతి" ఆరోపణలపై ప్రచారాన్ని కర్ణాట‌క ప్ర‌దేశ్‌ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టింది. అంతేకాకుండా.. కేపీసీసీ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ (844 770 40 40)ని ప్రకటించింది.

ప్ర‌భుత్వ అవినీతిపై త‌మ‌కు ప్రజలు కాల్ చేయొచ్చ‌ని కాంగ్రెస్ పార్టీ సూచించింది. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి ఫిర్యాదులను నమోదు చేయడానికి www.40percentsarkara.com అనే వెబ్‌సైట్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించ‌డం విశేషం.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది క‌ర్ణాట‌క అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గనున్న నేప‌థ్యంలో ఈ ప‌రిణామాల ప‌ట్ల బీజేపీ క‌ల‌వ‌ర‌ప‌డుతోంది. ఓవైపు సొంత పార్టీలోనే నేత‌ల ఇష్టానుసార ప్ర‌క‌ట‌నలు.. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాల దూకుడుతో బీజేపీ తీవ్ర ఆందోళ‌న చెందుతోంది. మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి అధికారాన్ని చేప‌ట్టడానికి కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే PayCM పేరిట పోస్ట‌ర్లు అతికించి బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెడుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.