Begin typing your search above and press return to search.

అడ్డొస్తే చావాల్సిందే అంటున్న పేటీఎం ఓన‌ర్‌

By:  Tupaki Desk   |   19 Jan 2017 11:24 AM GMT
అడ్డొస్తే చావాల్సిందే అంటున్న పేటీఎం ఓన‌ర్‌
X
పేటీఎం....ఈ డిజిట‌ల్ పేమెంట్ యాప్ గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఈ యాప్ పేరు మారుమోగిపోయింది. ఈ జోష్‌ లోనే పేటీఎం ఫౌండర్‌ & సీఈఓ విజయ్‌ శంకర్‌ శర్మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. తమ దారికి ఎవరైనా అడ్డొస్తే పక్కకి వెళ్లిపోవాలని లేదంటే చచ్చిపోతారని ఆయ‌న వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు అనంత‌రం పేటీఎం కంపెనీకి భారీగా లాభాలు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌క్సెస్ నేప‌థ్యంలో త‌న ఉద్యోగులకు సిలికాన్‌ వ్యాలీలో పేటిఎం సంస్థ‌ ప్రైవేటు విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా విజయ్‌ శర్మ మాట్లాడిన వీడియో యూట్యూబ్‌ లో వైరల్‌ గా మారింది. 'జో హమారే సాత్‌ నహి హే - వో రోహేగా' (ఎవరైతే తమ వెంబడి ఉండరో వారు ఏడవాల్సిందే) నని వ్యాఖ్యానించారు. ఎందుకంటే తమది సైకిలో ఆటోనో కాదని, ఏకంగా యుద్ధ ట్యాంక్‌ అని వ్యాఖ్యానించారు.

త‌మ ప్రయాణంలో ఎక్కడా సమస్య లేదని - రోడ్‌ బ్లాక్‌ అంతకంటే లేదని పేటీఎం సీఈఓ ధీమా వ్య‌క్తం చేశారు. తమకు సాధ్యం కానిది ఏదీ లేదని స్ప‌ష్టం చేస్తూ...అడ్డొచ్చిన వాటిని యుద్ధ ట్యాంకులాగా పచ్చడి చేస్తూ ముందుకు సాగుతామని గట్టిగా అరిచి మరీ చెప్పారు.ఎవరైనా అడ్డు వస్తే చావడమేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో తమ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ధీమా వ్య‌క్తం చేశారు. 10 ఏళ్లలో చేయాల్సిన పనిని తాము ఏడాదిలో చేశామని పేటీఎం సీఈఓ ప్ర‌క‌టించారు.

ఇదిలాఉండ‌గా....పేటీఎం ఫౌండర్‌ & సీఈఓ విజయ శంక‌ర్‌ శర్మతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దావోస్‌ లో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా పేటీఎంలో తెచ్చే కొత్త సాంకేతిక పద్ధతుల్ని ముందు ఆంధ్రప్రదేశ్‌ లోనే చేపడతామని శర్మ తెలిపారు. ప్రతి గ్రామంలో డిజిటల్‌ పేటీఎం బ్యాంకు ఉండేలా చూడటం తమ లక్ష్యంగా శ‌ర్మ‌ వెల్లడించారు. 2020 నాటికి 500 మిలియన్‌ ఖాతాలను సమకూర్చుకోవాల‌నే దిశ‌గా ముందుకు సాగుతున్న‌ట్లు తెలిపారు.ఈ సందర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ ప‌బ్లిక్‌-ప్రైవేట్ పార్ట‌న‌ర్ షిప్ పద్ధతి లో డిజిటల్‌ యూనివర్సిటీ స్థాపనకు ముందుకొస్తే తమ ప్రభుత్వం సహకరిస్తుందని హమీ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/