Begin typing your search above and press return to search.

కొత్త రెవెన్యూ మంత్రి పయ్యావుల ?

By:  Tupaki Desk   |   28 Oct 2015 6:43 AM GMT
కొత్త రెవెన్యూ మంత్రి పయ్యావుల ?
X
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ-స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అయిన కేఈ కృష్ణమూర్తికి ఓ శాఖ తగ్గబోతోంది. ఆయన పనితీరుపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేఈ వద్ద ఉన్న కీలకమైన రెవెన్యూ శాఖను సమర్తులకు అప్పగించాలన్నది చంద్రబాబు ప్లాను. రాయలసీమకే చెందిన పయ్యావుల కేశవ్(అనంతపురం)ను రెవెన్యూ మంత్రిని చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన పయ్యావులను ఇప్పటికే ఎమ్మెల్సీ చేయడంతో మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఆటంకాలేమీ లేవు.

అనుభవజ్ఙుడన్న కారణంతో కేఈ చేతికి ఆ శాఖ అప్పగించినా కొత్త రాష్ట్రంలో కీలకమైన దశలో ఆయన నిస్తేజంగా ఉంటున్నారని... చురుగ్గా పనిచేయడం లేదని చంద్రబాబు భావిస్తున్నారట. ఆ కారణంగానే రెవెన్యూ శాఖకు సంబంధించిన పనులనూ ఇతర మంత్రులతో చేయిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా అవినీతి ఆరోపణలూ ఉన్నాయని చెబుతున్నారు. రెవెన్యూ శాఖలో బదిలీలకు ఉత్తర్వులిస్తే.. దాని వెనుక పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని తెలుసుకున్న చంద్రబాబు రాత్రికి రాత్రి ఆ జీవోను ఆపించారు. ఇవన్నీ కేఈ చేతి నుంచి రెవెన్యూ శాఖ జారిపోవడానికి కారణమవుతున్నాయి.

అయితే... కేఈ నుంచి ఒక్క రెవెన్యూ మాత్రమే తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. స్టాంపులు - రిజిస్ట్రేషన్లు ఆయనకే ఉంచి, ప్రాధాన్యం లేని ఇంకో శాఖ ఏదైనా కూడా అప్పగించే యోచన ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికీ ఢోకాలేదని సమాచారం.