Begin typing your search above and press return to search.

పయ్యావుల నోరిప్పితే చాలా మందికి చిక్కులే

By:  Tupaki Desk   |   23 Oct 2017 5:26 AM GMT
పయ్యావుల నోరిప్పితే చాలా మందికి చిక్కులే
X
తెలుగుదేశం పార్టీలో తన స్థాయికి తగిన ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తితో వేగిపోతున్న నాయకుల్లో పయ్యావుల కేశవ్ కూడా ఒకరు. అసలే మంత్రి పదవి దక్కలేదని ఆయన అనుకుంటూ ఉంటే.. ఇటీవలి భేటీలో కేసీఆర్ తో మాట్లాడినందుకు - చంద్రబాబునాయుడు తప్పుపడుతూ వ్యాఖ్యలు చేయడం ఆయనను మరింత బాధించింది. పుండు మీద కారం చల్లినట్లుగా.. తాజాగా కాంగ్రెస్ లోకి ఫిరాయించదలచుకున్న తె-తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కొత్తగా జత కలిశాయి. కేసీఆర్ తో పయ్యావుల సత్సంబంధాలు వ్యాపార లావాదేవీల పుణ్యమేనంటూ రేవంత్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై పయ్యావుల ప్రెస్ మీట్ ద్వారా జవాబు చెప్పడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అయతే తాజాగా ఏపీ తెలుగుదేశంలో పుడుతున్న గుబులు ఏంటంటే.. పయ్యావుల నోరిప్పితే గనుక.. ఏపీలోని చాలా మంది తెలుగుదేశం నాయకులకు ఇబ్బందే అని అనుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేవలం ఒక్క పయ్యావుల మీద మాత్రమే కాదు.. చంద్రబాబునాయుడు కేబినెట్ లో కీలకంగా ఉన్న యనమల రామకృష్ణుడు ఇంకా అనేక మంది నాయకులపై కూడా కలిపి ఆరోపణలు గుప్పించారు. పయ్యావుల వాటికి స్పందించి తన నిజాయితీని చాటుకునేలా.. ప్రకటన చేస్తే గనుక.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా అదే రీతిగా స్పందించాల్సి వస్తుంది. యనమల వంటి చాలా మంది సీనియర్లకు అలా స్పందించి వివరణ ఇవ్వడం ఇష్టం ఉండకపోవచ్చునని పార్టీ వర్గాలే అంటున్నాయి.

అలాగని వివరణ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతే.. పయ్యావుల వివరణ తర్వాత- మిగిలిన వారి మౌనం ఆరోపణల్ని అంగీకరించడమే అనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకువెళతాయనే భయం కూడా ఉంది. అందుకే చాలా నాయకులు తర్జన భర్జనలు పడుతున్నారు. చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. ఆయనతో చర్చించి.. రేవంత్ విషయంలో ఎలా స్పందించాలో ఆయన మాట మేరకు నడుచుకోవాలని వారు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబునాయుడు వచ్చేదాకా పయ్యావుల కూడా స్పందించకుండా ఉంటేనే బాగుంటుందని కూడా పలువురు నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.