Begin typing your search above and press return to search.

పీఏసీ పదవి.. పయ్యావుల చెప్పిన రహస్యం!

By:  Tupaki Desk   |   5 Aug 2019 5:26 AM GMT
పీఏసీ పదవి.. పయ్యావుల చెప్పిన రహస్యం!
X
పయ్యావుల కేశవ్.. అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే. టీడీపీ సీనియర్ నేత. కానీ పాపం దురదృష్ట నేతగా టీడీపీలో చెప్పుకుంటారు. టీడీపీ రాష్ట్రంలో గెలిచినప్పుడు ఈయన గెలవరు.. టీడీపీ రాష్ట్రంలో ఓడిపోయినప్పుడు ఈయన గెలుస్తుంటారు. అందుకే మంత్రి పదవి చేపట్టాలన్న ఆయన కోరిక అలానే ఉండిపోయింది. ఈసారి కూడా అలానే జరిగింది.

టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఈయనకు ఇప్పుడు ప్రతిపక్షంలో చంద్రబాబు కేబినెట్ ర్యాంకు పదవిని ఇచ్చారు. ప్రతిపక్షానికి అధికార వైసీపీ ఇచ్చే ఏకైక కేబినెట్ ర్యాంక్ పదవి ‘పీఏసీ చైర్మన్’. ఈ పదవికి టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. మాజీ మంత్రి గంటాతో పాటు అచ్చెన్నాయుడు - బుచ్చయ్యచౌదరి తోపాటు పలువురు బీసీ - కాపునేతలు ఆశించారు. కానీ చంద్రబాబు మాత్రం పయ్యావులకే ఆ పదవి కట్టబెట్టారు.

తాజాగా పయ్యావుల ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసే పీఏసీ చైర్మన్ పదవిని చేజిక్కించుకున్నానన్న వార్తలపై స్పందించారు. చంద్రబాబు తనకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తానన్నప్పుడు వద్దన్నానని పయ్యావుల చెప్పుకొచ్చాడు. వైసీపీ ఇంత వేవ్ లో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.

అయితే చంద్రబాబు మాత్రం గతంలో పీఏసీలో పనిచేసిన సభ్యుడు కావడం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ అక్రమాలు - నిధుల దుర్వినియోగం చేసిన వాటిని వెలికితీసిన అనుభవం ఉన్న కారణంగానే తననే పీఏసీ చైర్మన్ గా ఉండమని కోరాడని.. ఇక పోటీవచ్చిన మాజీ మంత్రి గంటాకు తాను వైదొలిగి తననే సపోర్ట్ చేయడంతో ఇక ఒప్పుకున్నానని పయ్యావుల చెప్పుకొచ్చాడు.

తాను బీజేపీలోకి వెళతానని బెదిరించి పీఏసీ చైర్మన్ ను తెచ్చుకున్నానన్న విమర్శలు అర్థరహితమని పయ్యావుల స్పష్టం చేశారు. బీజేపీలో చేరడానికి తాను అమెరికా తానాసభలకు వెళ్లి రాంమాధవ్ తో సమావేశమవ్వాల్సిన ఖర్మ పట్టలేదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు తనతో టచ్ లోకి వచ్చినా తాను చేరనని స్పష్టం చేసినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు.