Begin typing your search above and press return to search.

ఆ సెంటిమెంట్ రిపీట్‌..ప‌య్యావుల ప‌క్కా వైసీపీలోకే...

By:  Tupaki Desk   |   31 July 2019 7:38 AM GMT
ఆ సెంటిమెంట్ రిపీట్‌..ప‌య్యావుల ప‌క్కా వైసీపీలోకే...
X
తెలుగు రాజ‌కీయాల్లో సెంటిమెంట్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కొన్నిసార్లు వ‌రుస‌గా జ‌రిగిన సంఘ‌ట‌న‌లో మ‌ళ్లీ వ‌రుస‌గా జ‌రుగుతుంటే అవే రిపీట్ అవుతాయ‌న్న ఊహ‌లు - అంచ‌నాలు మొద‌ల‌వుతాయి. ఇప్పుడు తెలుగు రాజ‌కీయాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఏపీలో ఇటీవ‌ల జరిగిన ఎన్నికల్లో విపక్ష టిడిపి 23 ఎమ్మెల్యే... 3 ఎంపీ సీట్లతో సరిపెట్టుకున్న‌ సంగతి తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల‌పై ఆయ‌న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స్టార్ట్ చేశారు. ఆ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల‌తో పాటు ముగ్గురు ఎంపీల‌ను లాగేసుకున్నారు. వీరిలో కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు కూడా క‌ట్ట‌బెట్టారు.

క‌ట్ చేస్తే ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో చివ‌ర‌కు టీడీపీ 23 అసెంబ్లీ సీట్ల‌తో పాటు మూడు ఎంపీ సీట్ల‌తో స‌రిపెట్టుకుంది. అంటే చంద్ర‌బాబు వైసీపీని బ‌ద్నాం చేసేందుకు ఎక్క‌డ నుంచి ప్రారంభించారో చివ‌ర‌కు ఆయ‌న అక్క‌డికే వ‌చ్చి ఆగిపోయార‌ని వైసీపీ వాళ్లు బాబుపై ఓ రేంజ్‌లు సెటైర్లు వేశారు. ఇక ఈ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కూడా అప్పుడు వైసీపీలో పీఏసీ చైర్మ‌న్‌ గా ఉన్న భూమా నాగిరెడ్డి నుంచే బాబు ప్రారంభించారు. భూమాపై తీవ్ర‌మైన ఒత్తిడి తేవ‌డంతో చివ‌ర‌కు ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఆశించి పార్టీ వీడారు.

చివ‌ర‌కు ఆ ప‌ద‌విని అప్ప‌ట్లో వైసీపీలో చాలా మంది ఆశించినా జ‌గ‌న్ దానిని బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌ రెడ్డికి ఇచ్చారు. చివ‌ర‌కు ఇప్పుడు అదే రాజేంద్ర‌నాథ్ ఏపీ ఆర్థిక‌మంత్రిగా ఉన్నారు. ఇక ఇప్పుడు టీడీపీలోనూ ఈ పీఏపీ చైర్మ‌న్ క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ప‌ద‌వి కోసం చాలా మంది పోటీ ప‌డినా బాబు త‌న సామాజిక‌వ‌ర్గానికే చెందిన ప‌య్యావుల కేశ‌వ్‌ కు ఇచ్చారు. ప‌య్యావుల బాబుకు షాక్ ఇచ్చి పార్టీ మారిపోతార‌న్న టాక్ వ‌చ్చింది. ఆయ‌న్ను కంట్రోల్ చేసేందుకే బాబు ఆ ప‌ద‌వి ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్టార‌న్న ప్ర‌చారం టీడీపీలో జ‌రుగుతోంది.

వాస్త‌వానికి ప‌య్యావుల‌కు వైసీపీ నుంచి ఎన్నిక‌ల‌కు ముందు ఆఫ‌ర్ వెళ్లినా ఆయ‌న పార్టీ మార‌లేదు. ఇప్పుడు మారాలంటే ఎమ్మెల్యే ప‌ద‌వి వదులుకోవాలి. ప‌య్యావుల‌కు కూడా టీడీపీ ఫ్యూచ‌ర్ ఏంటో అర్థ‌మైపోయింది. రేపు కాక‌పోతే ఎప్పుడైనా ఆయ‌న చూపు వైసీపీ వైపే ఉందంటున్నారు. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా ఇదే పీఏసీ పదవి ఉన్న వ్య‌క్తి అప్ప‌టి అధికార ప‌క్షంలోకి జంప్ చేశారు. అప్ప‌టి నుంచి జ‌రిగిన కాక‌తాళీయ‌మైన అంశాల‌ను కంపేరిజ‌న్ చేస్తే ఇప్పుడు ప‌య్యావుల కూడా వైసీపీలోకి వెళ‌తాడేమో ? చూడాలి. ఒక్క‌టి మాత్రం నిజం ప‌య్యావుల ప‌క్క చూపులు చూస్తున్నందునే బాబు ఆయ‌నకు ఈ ప‌ద‌వి ఇచ్చార‌ట‌. ఇది టీడీపీ వాళ్లు చెప్పిందే సుమా..!