Begin typing your search above and press return to search.

రేవంత్ కు పీసీసీ: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   27 Jun 2021 2:30 PM GMT
రేవంత్ కు పీసీసీ: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X
టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరి ఆది నుంచి ఉన్న కాంగ్రెస్ సీనియర్లను పక్కనపెట్టి మరీ పీసీసీ పగ్గాలు అందుకున్న రేవంత్ రెడ్డి నియామకంపై సగటు కాంగ్రెస్ వాదులు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. కానీ నాణేనికి మరోవైపు రేవంత్ ను పీసీసీ చేయడంపై కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు.

తాజాగా రేవంత్ కు ప్రధాన పోటీదారుగా నిలబడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు పీసీసీ దక్కకపోవడంపై ఘాటుగా స్పందించాడు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ అప్పగించడంపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇక నుంచి తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనని.. తన నియోజకవర్గం, జిల్లాకే పరిమితం అవుతానని కోమటిరెడ్డి స్పష్టం చేశాడు. హుజూరాబాద్ లోరాబోయే ఎన్నికల్లో కొత్త కార్యవర్గం కనీసం డిపాజిట్లు తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా టీటీడీపీ మాదిరిగానే మారబోతోందని వ్యాఖ్యానించారు.

పీసీసీని ఇన్చార్జి అమ్ముకున్నారని.. త్వరలోనే ఆధారాలతో బయటపెడుతానని కోమటిరెడ్డి ఆరోపించారు. టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్టు తనకు ఢిల్లీ వెళ్లాక తెలిసిందన్నారు.

ఇక తాను మాత్రం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై విమర్శలు చేయనని.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం దూరంగా ఉంటానని కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.