Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేనే కొట్టి చంపబోయారు

By:  Tupaki Desk   |   19 July 2016 6:37 AM GMT
ఎమ్మెల్యేనే కొట్టి చంపబోయారు
X
కాశ్మీర్లో అల్లర్లు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అక్కడ ఎప్పుడేం జరుగుతుందో తెలియని భీతావహ పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు మీదికి వచ్చినవాళ్లెవరి ప్రాణాలకూ హామీ లేదక్కడ. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినా.. అక్కడి వాస్తవ పరిస్థితి ఏంటన్నది బయటి ప్రపంచానికి తెలియకుండా నొక్కిపెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఓ ఎమ్మెల్యేనే నడిరోడ్డు మీద చంపే ప్రయత్నం జరిగింది. పీడీపీ ఎమ్మెల్యే మహ్మద్‌ ఖలీల్‌ పై సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఖలీల్ తన వాహనంలో శ్రీనగర్‌ కు వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు అడ్డగించారు. ఆయన్ని బయటికి లాగి తీవ్రంగా కొట్టారు. దీంతో ఖలీల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సమీపంలోని మిలిటరీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఉగ్రవాది బుర్హాన్‌ వాని ఎన్‌ కౌంటర్‌ అనంతరం కాశ్మీర్‌ లోయలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ ఉగ్రవాదికి పాకిస్థాన్ జెండాను చుట్టి ఊరేగింపు చేసే అంత్యక్రియలు చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అమర్‌ నాథ్‌ వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకున్న యాత్రికులు అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. దుండగులు ఆర్మీ క్యాంపుల మీదే కాక.. సామాన్యుల ఆస్తులపైనా దాడికి దిగుతున్నారు. ఉత్తర కాశ్మీర్‌ లోని బండీపొరా జిల్లాలో ఓ ఆర్మీ క్యాంపును దుండగులు ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఓ సైనికుడు మృతి చెందాడు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు విడతలుగా దాదాపు ఐదు వేల మంది వేల మంది సీఆర్‌ పీఎఫ్‌ సిబ్బందిని కాశ్మీర్‌ పంపించినా ప్రయోజనం లేకపోయింది. కశ్మీర్‌ లోయ అంతటా కర్ఫ్యూ కొనసాగుతోంది.