Begin typing your search above and press return to search.

టీడీపీ నేత శివప్రసాద్ మృతితో వైసీపీ మంత్రి భావోద్వేగం - కన్నీళ్లు

By:  Tupaki Desk   |   22 Sep 2019 7:51 AM GMT
టీడీపీ నేత శివప్రసాద్ మృతితో వైసీపీ మంత్రి భావోద్వేగం - కన్నీళ్లు
X
టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ మృతికి పార్టీలకు అతీతంగా నాయకులు నివాళులర్పిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వైకాపా నేత - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శివప్రసాద్‌ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన ఆయన - శివప్రసాద్ విలక్షణ రాజకీయ నాయకుడని, ప్రతిభగల నటుడని అన్నారు. శివప్రసాద్ తో తనకున్న సంబంధం రాజకీయాలకు అతీతమైనదంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

శివప్రసాద్ అకాల మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని - ఆయన ఆత్మకు శాంతి చేరుకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నానని అన్నారు. తనను శివప్రసాద్ అన్నయ్యా అంటూ ప్రేమతో పలకరించేవారని - అటువంటి మిత్రుడిని తాను కోల్పోయానని అన్నారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి పరామర్శించారు.

కాగా, శివప్రసాద్ అంత్యక్రియలు నేడు చంద్రగిరి సమీపంలోని అగరాలలో జరగనున్నాయి. ఆయనకు కడసారి నివాళులు అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు లోకేష్‌ తదితరులు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలోని శివప్రసాద్ నివాసంతో ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం తరువాత అంతిమయాత్ర చేపడతారు.

శివప్రసాద్‌ కు పార్టీలకు అతీతంగా మిత్రులు ఉండడంతో ఆయన మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాల నేతలూ సంతాపంవ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితోనూ శివప్రసాద్‌ కు మంచి సంబంధాలు ఉండడంతో రాజశేఖరరెడ్డి అనుచరులు - రాయలసీమ నేతలందరికీ శివప్రసాద్ సుపరిచితులే. ఆ కారణంగానే ఇప్పటికే పలువురు నేతలు చెన్నై వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించి వచ్చారు. ఈ రోజు తిరుపతిలోని ఆయన నివాసానికి మిగతా నేతలు వెళ్లనున్నారు.