Begin typing your search above and press return to search.

రిటైర్ అయినా వదిలేట్లు లేరుగా ?

By:  Tupaki Desk   |   18 March 2021 4:23 AM GMT
రిటైర్ అయినా వదిలేట్లు లేరుగా ?
X
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రిటైర్ అయిన తర్వాత ఇబ్బందులు తప్పేట్లు లేదు. కమీషనర్ కు ప్రివిలేజ్ కమిటి ముందుకు హాజరవ్వాలంటూ నోటీసు జారీ చేయాలని కమిటి సమావేశం నిర్ణయించింది. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వాన్ని నానా ఇబ్బందులు పెట్టారు. చీటికి మాటికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేశారు. కరోనా వైరస్ పెద్దగా లేనపుడేమో ఎన్నికలను వాయిదా వేసేశారు. ఎన్నికలను వాయిదా వేసేటపుడు ప్రభుత్వంతో కనీసం మాట మాత్రంగా కూడా చెప్పలేదు.

అప్పటికన్నా మొన్నటి ఫిబ్రవరిలో కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో ఎన్నికలను నిర్వహించాల్సిందే అంటూ పట్టుబట్టారు. ప్రభుత్వం కాదు కూడదంటే కోర్టుకెళ్ళి ఆదేశాలు తెప్పించుకున్నారు. దాంతో ప్రభుత్వం-నిమ్మగడ్డ మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులాగ తయారైంది. మధ్యలో నిమ్మగడ్డ తెల్లజెండా ఊపినట్లు అనిపించినా జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ విషయంలో మళ్ళీ పరిస్ధితి మొదటికే వచ్చేట్లుంది.

ఈ నేపధ్యంలోనే బుధవారం ప్రివిలేజ్ కమిటి సమావేశం జరిగింది. అప్పుడెప్పుడో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ విషయంలో నిమ్మగడ్డ చాలా అతిగా వ్యవహరించారు. ఇద్దరినీ హౌస్ అరెస్టు చేయాలని, మీడియాతో మాట్లాడనీయకూడానే పిచ్చిపిచ్చి ఆదేశాలన్నీ ఇచ్చారు. అంతేకాకుండా ఇదే విషయమై గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశారు. మంత్రులపై గవర్నర్ చర్యలు తీసుకోనిపక్షంలో తాను కోర్టుకెళతానని కూడా హెచ్చరించారు.

దాంతో మంత్రులిద్దరు నిమ్మగడ్డపై ప్రివిలేజ్ కమిటికి ఫిర్యాదు చేశారు. మంత్రుల విషయంలో నిమ్మగడ్డ ఆదేశాలను కోర్టు కొట్టేసినా మంత్రులు మాత్రం తమ పట్టు వీడలేదు. దాంతో బుధవారం సమావేశమైన కమిటి నిమ్మగడ్డకు నోటీసు ఇవ్వాలని డిసైడ్ చేసింది. కమిటి ముందుకొచ్చి సంజాయిషి ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేయనున్నట్లు ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నిమ్మగడ్డకు నోటీసు ఇవ్వాల్సిందిగా అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచర్యులను ఆదేశించినట్లు ఛైర్మన్ చెప్పారు.

ఛైర్మన్ వరసచూస్తుంటే నిమ్మగడ్డ రిటైర్ అయినా కూడా వదిలేట్లు లేరు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన కారణంగా నిమ్మగడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి బాగా మండిపోతున్నారు. అందుకే నిమ్మగడ్డ రిటైర్ అయినా వదిలిపెట్టేది లేదంటూ ఛైర్మన్ స్పష్టంగా ప్రకటించారు.