Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌... నిర్ణ‌యం మార‌దు

By:  Tupaki Desk   |   7 Aug 2017 9:46 AM GMT
జ‌గ‌న్‌... నిర్ణ‌యం మార‌దు
X
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిరంత‌రం జ‌పించే విలువ‌లు కేవలం మాట వ‌రుస‌కే అయితే త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వాటిని అక్ష‌రాల ఆచ‌ర‌ణ‌లో చూపే మ‌నిషి అని వైసీపీ సీనియ‌ర్ నేత‌ - పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ ఎస్‌ లో చేరిన సందర్భంలో పశువులను కొన్నట్లు మా ఎమ్మెల్యేలను కొన్నారని విమర్శించిన చంద్రబాబు.... ఏపీలో 21 మందిని తన పార్టీలో ఎలా చేర్చుకున్నారని ప్ర‌శ్నించారు. బాబు అన్న‌ట్లుగా ఆయన ఏ పశువులను కొన్నారని పెద్దిరెడ్డి నిలదీశారు. త‌మ నాయ‌కుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్ అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలోకి వేరే ప్రజాప్రతినిధులు వస్తే వారితో రాజీనామా చేయించిన తరువాతనే పార్టీలో చేర్చుకున్న నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని గర్వంగా చెప్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. దేశంలోనే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన ఏకైక పార్టీ వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలు నీతులు చెబుతున్నారని, అయితే వారి నీతులు నేతి బీరకాయలో నెయ్యి అంత చందమేన‌ని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ మారితే ఆ పార్టీకి రాజీనామా చేయాలన్నారు. అదే రీతిలో తాజాగా శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారన్నారు. స్పీకర్‌ ఫార్మెట్‌లో మా నాయకుడికి చక్రపాణిరెడ్డి రాజీనామా పత్రం ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో కొలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. బాబు మ‌రియు ఆయ‌న బ్యాచ్ చెప్తున్న మాట‌ల ప్ర‌కారం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి చేసి ఉంటే 21 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని రామ‌చంద్రారెడ్డి ప్రశ్నించారు. అంటే మీకు ప్రజల మీదా, ప్రజాస్వామ్యం మీదా నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తూ కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు అనవసర వ్యాఖ్యలతో రాద్దాంతం చేయడం సరికాదన్నారు. మళ్లీ ఎన్నికలకు వెళ్తే గెలవలేమనే అపనమ్మకంతోనే ఎన్నికలకు దూరంగా ఉన్నారని విమర్శించారు. 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని పెద్దిరెడ్డి సవాల్‌ విసిరారు. 20 మందిని నేను గెలిపించలేను, అందుకే వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చామని చంద్రబాబే ఒప్పుకోవాలన్నారు

నంద్యాల అభివృద్ధి ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార తెలుగుదేశం పార్టీకి గుర్తుకు రావ‌డం శోచ‌నీయ‌మ‌ని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. చిన్న అభివృద్ధి కార్యక్రమానికి కూడా ఇన్నాళ్లు శంకుస్థాపన చేయలేదని, ఉప ఎన్నిక ఉందని హడావుడిగా శంకుస్థాపనలు చేయడం సిగ్గు చేటన్నారు. నంద్యాల ప్రజలకు మీరు ఏం చేయబోతున్నారో ఏ మంత్రి - ఎమ్మెల్యే - టీడీపీ అభ్యర్థి స్పష్టంగా చెప్పడం లేదన్నారు. ఎన్నికల తరువాత వీరంతా ఎక్కడ ఉంటారో అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.