Begin typing your search above and press return to search.

పెద్దిరెడ్డి సంచలనం..పోలవరంపై వెనక్కు తగ్గేది లేదట!

By:  Tupaki Desk   |   26 Aug 2019 10:22 AM GMT
పెద్దిరెడ్డి సంచలనం..పోలవరంపై వెనక్కు తగ్గేది లేదట!
X
ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం తనదైన శైలి దూకుడును ప్రదర్శిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలను వెలికితీయడంతో పాటు వృథా అయిన ప్రజా ధనాన్ని కక్కిస్తామన్న రీతిలో చాలా స్టడీగానే సాగుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు... తాను తీసుకున్న నిర్ణయాలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న రీతిలో సాగుతోంది. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)పైనా అదే వైఖరిని ప్రదర్శిస్తున్న జగన్ సర్కారు... ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనా తన వైఖరి మేరకే ముందుకు సాగేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే వెనకగుడు వేసే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పేసింది. ఈ మేరకు జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను కలకలమే రేపుతున్నాయని చెప్పక తప్పదు.

పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించిన పెద్దిరెడ్డి... ఆ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తాము తీసుకున్న రివర్స్ టెండరింగ్ పై వెనక్కు తగ్గేది లేదని సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి వదిలే ప్రసక్తే లేదని కూడా పెద్దిరెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని - ఇదివరకు కుదిరిన ఒప్పందం మేరకు కేంద్రం నిధులు సమకూర్చాలని చెప్పిన పెద్దిరెడ్డి... ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్న తమ ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని కూడా తేల్చి చెప్పపేశారని చెప్పాలి.

అయినా ఈ దిశగా పెద్దిరెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే... పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పెద్దిరెడ్డి అన్నారు. ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని, ఈ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. రీ టెండరింగ్ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులను కొనసాగిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణ పనులను కేంద్రానికి అప్పగించే యోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పెద్దిరెడ్డి వెల్లడించారు. వచ్చే నెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీలో పర్యటిస్తారని... పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు.