Begin typing your search above and press return to search.

అటెండ‌ర్‌ తో బాబును ఓడిస్తా... పెద్దిరెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   8 Jan 2022 6:30 AM GMT
అటెండ‌ర్‌ తో బాబును ఓడిస్తా... పెద్దిరెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు
X
టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుప్పం ప‌ర్య‌ట‌న రాజ‌కీయ స‌వాళ్ల‌కు వేదిక‌గా మారింది. రాష్ట్రంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేతల మ‌ధ్య చోటు చేసుకుంటున్న మాట‌ల యుద్ధం అప్పుడే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తోంది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఎన్నిక‌ల పొత్తులపై బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఎన్నిక‌ల్లో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని ఓడించి తీరుతామ‌ని బాబు చేసిన వ్యాఖ్య‌ల‌కు తాజాగా పెద్దిరెడ్డి ఘాటుగా స‌మాధాన‌మిచ్చారు.

కుప్పం పై గురి..

వ‌రుసగా ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచిన బాబుకు ఇప్పుడు అక్క‌డ ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా మారుతున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కుప్పం కోట‌ను బ‌ద్ద‌లు కొట్టేందుకు వైసీపీ ప్ర‌త్యేక దృష్టి సారించ‌డ‌మే అందుకు కార‌ణం. మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వ‌ర్యంలో వైసీపీ ఆ దిశ‌గా విజ‌య‌వంతంగా ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే వివిధ ఎన్నిక‌ల్లో వైసీపీ చేతిలో టీడీపీ ఓట‌మి పాలైంది. దీంతో కుప్పంపై బాబు కూడా ఫోక‌స్ పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పెద్దిరెడ్డిపై వ్యాఖ్య‌లు చేశారు. దానికి స‌మాధానంగా ద‌మ్ముంటే చిత్తూరు జిల్లా పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని బాబుకు పెద్దిరెడ్డి స‌వాలు విసిరారు. అంతే కాకుండా కుప్పంలో ఈ సారి చంద్ర‌బాబుకు పోటీగా త‌న అటెండ‌ర్‌ను బ‌రిలోకి దించి మ‌రీ ఆయ‌న్ని ఓడిస్తామ‌ని పెద్దిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాబు త‌ల‌కిందులుగా త‌ప‌స్సు చేసినా బాబు కుప్పంలో గెల‌వ‌లేర‌ని ఆయ‌న పేర్కొన్నారు.

నైతిక విజ‌యం..

కేవ‌లం ఎన్నిక‌ల స‌మయంలోనే బాబు కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చేవార‌ని కానీ ఇప్పుడు గ్రామాలు కూడా తిర‌గాల‌ని ఆలోచిస్తున్నార‌ని అది త‌మ నైతిక విజ‌యమ‌ని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అయితే తాజాగా బాబుపై పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు టీడీపీ మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. కుప్పంలో అటెండ‌ర్ ఎందుకు? ద‌మ్ముంటే ఆయ‌నే పోటీ చేసి గెలిచి చూపించాల‌ని పెద్దిరెడ్డికి ప్ర‌తి స‌వాలు విసిరారు. ఇలా చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న మొత్తానికి మ‌రోసారి నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి తెర‌తీసింద‌ని చెబుతున్నారు.