Begin typing your search above and press return to search.

బాబుపై దెబ్బ‌.. ఆ మంత్రి వ్యూహం

By:  Tupaki Desk   |   21 Sep 2021 9:30 AM GMT
బాబుపై దెబ్బ‌.. ఆ మంత్రి వ్యూహం
X
2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారాన్ని ద‌క్కించుకున్న వైసీపీకి ఇప్ప‌టికీ ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గ‌లేద‌నే విష‌యం మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాలే అందుకు నిద‌ర్శ‌న‌మ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. సీఎం జ‌గ‌న్‌కు జ‌నాల్లో ఉన్న మ‌ద్ద‌తు మ‌రోసారి నిరూపిత‌మైంది. రాష్ట్రంలో ఆర్థిక స‌మ‌స్య‌లు.. అప్పులు.. ఇలా ఓ ద‌శ‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే ప్ర‌చారం సాగింది. కానీ ఈ ఎన్నిక‌ల‌తో అదంతా అబ‌ద్ధ‌మ‌నే విష‌యం తెలిసింది. రెండున్న‌రేళ్లు కావొస్తున్నా ప్ర‌భుత్వం ఎలాంటి వ్య‌తిరేక‌త లేద‌ని విష‌యం స్ప‌ష్ట‌మైంది.

ఈ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఆ పార్టీ అభ్య‌ర్థులు బ‌రిలో దిగారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సొంత జిల్లా అయిన చిత్తూరులో ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించి బాబుకు షాకిచ్చింది. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంతో పాటు సొంత గ్రామంలోనూ వైసీపీ స‌త్తాచాటింది. జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ ప‌ద‌వితో పాటు అన్ని మండ‌ల ప‌రిష‌త్‌ల‌కూ వైసీపీ సొంతం చేసుకుంది. ఆ జిల్లాలో టీడీపీ కేవ‌లం 25 ఎంపీటీసీ స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 886 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 822 చోట్ల వైసీపీ త‌న జెండాను ఎగ‌ర‌వేసింది. అందులో ఇదివ‌ర‌కే 433 స్థానాలు ఆ పార్టీకి ఏక‌గ్రీవం కాగా.. ఇప్పుడు ఎన్నిక‌ల్లో 389 స్థానాల‌ను ఆ పార్టీ ద‌క్కించుకుంది. అందులో బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పం ప‌రిధిలోని నాలుగు మండ‌లాలతో పాటు బాబు సొంతూరు నారావారి ప‌ల్లె ఉన్నాయి.

బాబు కుప్పం కోట కుప్ప‌కూల‌డం వెన‌క అదే జిల్లాకు చెందిన వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ్యూహాలున్నాయి. అక్క‌డ వైసీపీ ఆధిప‌త్యం చ‌లాయించ‌డంలో ఆయ‌న ప్ర‌ముఖ పాత్ర పోషించార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. చాప‌కింద నీరులా టీడీపీని బ‌లహీన‌ప‌ర్చ‌డంలో ఆయ‌న విజ‌య‌వంత‌మ‌య్యారనే టాక్ వినిపిస్తోంది. గ్రామ‌స్థాయి నుంచి ఆయ‌న టీడీపీని న‌రుక్కుంటూ వ‌చ్చార‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టికే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా ఫ‌లితాలు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు అదే ప్ర‌ద‌ర్శ‌న పునరావృతం చేసింది. ఎలాంటి రాజ‌కీయ నేప‌థ్యం లేని కుటుంబాల‌కు చెందిన వాళ్ల‌ను పెద్దిరెడ్డి అభ్య‌ర్థులుగా నిలిపారు. పార్టీ కోసం ప‌ని చేసిన వాళ్ల‌కు గుర్తింపున్నిచ్చారు. ముఖ్యంగా 23 ఏళ్ల అశ్వినిని కుప్పం ప‌రిధిలో నిలిపి గెలిపించుకోవ‌డం కూడా పెద్దిరెడ్డి వ్యూహంలో భాగ‌మేన‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ స‌ర్కారు అమ‌లు చేస్తున్న ప్ర‌భుత్వ సంక్షేమ పథ‌కాలు కూడా ఈ ఫ‌లితాల‌కు ఓ కార‌ణ‌మ‌య్యాయనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.