Begin typing your search above and press return to search.

ఏపీలో బీఆర్ఎస్ మ‌నుగ‌డ క‌ష్టం: డిప్యూటీ సీఎం హాట్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   6 Oct 2022 8:44 AM GMT
ఏపీలో బీఆర్ఎస్ మ‌నుగ‌డ క‌ష్టం: డిప్యూటీ సీఎం హాట్ కామెంట్స్!
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్ర చర్చలు మొదలయ్యాయి.

ఆంధ్రా రాజకీయాలపై బీఆర్‌ఎస్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే వివిధ రాజకీయ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఈ విష‌యంపై ప్ర‌శ్నించ‌గా ఆయ‌న చిరున‌వ్వే స‌మాధానంగా స్పందించారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ నేత‌లు మాత్రం ధీటుగా స్పందిస్తున్నారు.

తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజ‌న్న‌దొర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎవ‌రికైనా ఎక్కడైనా రాజకీయ పార్టీని ప్రారంభించే స్వేచ్ఛ ఉందన్నారు. కాబట్టి, కేసీఆర్ బీఆర్‌ఎస్‌ని ప్రారంభించి, ఆంధ్రాలో ఎన్నికల్లో పోటీ చేసినా త‌మ‌కు అభ్యంతరం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ పార్టీ మనుగడ సాగించే అవకాశాలు లేవని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రజలు దీనిని అంగీకరించరని రాజ‌న్న దొర స్ప‌ష్టం చేశారు. ''కేసీఆర్ ఇక్కడికి వచ్చి మా ప్రజలపై ఆధిపత్యం చెలాయించడానికి ఎలా అనుమతిస్తాం? హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయడానికి అంగీకరించలేదు. కాబట్టి ఇక్కడ ఆయన ఆధిపత్యాన్ని ప్రజలు అంగీకరించరు'' అని రాజన్న దొర కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

అయితే మనుగడలో విఫలమైన కొన్ని పార్టీలు కేసీఆర్‌తో చేతులు కలపవచ్చని డిప్యూటీ సీఎం రాజ‌న్న‌దొర అభిప్రాయ‌ప‌డ్డారు. అలాగే రాజకీయంగా భవిష్యత్తు అవకాశాలు లేని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బీఆర్‌ఎస్‌లోకి జంప్ అయ్యే అవకాశం ఉంద‌న్నారు.

అదేవిధంగా కేసీఆర్... ఉత్తర కోస్తా ఆంధ్రా నుండి వెలమ నాయకులను కూడా ఆకర్షించడానికి ప్రయత్నించవచ్చ‌న్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ కేసీఆర్ పార్టీలో చేరర‌ని తేల్చిచెప్పారు. ప్రజల మద్దతుతో ఆంధ్రప్రదేశ్‌లో త‌మ‌ పార్టీ చాలా బలంగా ఉంద‌న్నారు. కాబట్టి వైఎస్సార్‌సీపీకి ఎలాంటి ముప్పు లేద‌ని పేర్కొన్నారు. వైఎస్సార్ పార్టీ పటిష్టంగా ఉంద‌ని గుర్తు చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో 175 సీట్లు కి 151 తెచ్చుకుని ప్రజా రంజకపాలన చేస్తుంద‌న్నారు.

మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఏ పార్టీ పోటీ కాదన్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణమైన కేసీఆర్ ను ఏపీలో ఆదరించే పరిస్థితి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీకి పోటీ వుండద‌న్నారు. మరో25 ఏళ్లు వైఎస్ జగన్ ఏపీకి సీఎంగా వుంటారని తేల్చిచెప్పారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.