Begin typing your search above and press return to search.

నాడు అమ్ముడు పోలేదు : నేడు డిప్యూటీ సీఎం అయ్యా...?

By:  Tupaki Desk   |   2 July 2022 10:30 AM GMT
నాడు అమ్ముడు పోలేదు : నేడు డిప్యూటీ సీఎం అయ్యా...?
X
అమ్ముడు పోవడాలు కొనుగోలు చేయడాలు రాజకీయ పరిభాషలో చాలసార్లు దొర్లేస్తూంటాయి. నాయకులు అన్న వారు సిద్ధాంతబద్ధులు కాన‌పుడే ఈ బిజినెస్ వర్డ్స్ ముందుకు వస్తాయి. వర్తమాన రాజకీయాలో చూస్తే ఈ రకమైన పడికట్టు పదాలకు డిమాండ్ ఇంకా పెరుగుతోంది. అమ్ముడయ్యే సరుకు ఉంటే కొనే వాడు ఎపుడూ ఉంటాడు అన్నది వ్యాపార సూత్రం. రాజకీయాల్లోనూ అదే ఇపుడు హైలెట్ గా ఉంటోంది అంటే ఒకింత విషాదమే.

ఇవన్నీ పక్కన పెడితే విజయనగరంలో తాజాగా జరిగిన వైసీపీ ప్లీనరీలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఒక సంచలన కామెంట్ చేశారు. ఒక్కసారి ఆయన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారు.

తాను 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీ తరఫున విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నపుడు తన దగ్గరకు బ్రహ్మాండమైన ప్రతిపాదనలతో టీడీపీ వారు వచ్చారని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆనాడు తాను కనుక వైసీపీ నుంచి ఫిరాయిస్తే ముప్పయి కోట్లు ఇస్తామని బేరం పెట్టారని కూడా చెప్పారు. అంతే కాదు అమరావతిలో మంచి ఇల్లు, తనకు మంత్రి పదవి, తన పిల్లలకు చదువు చెప్పే బాధ్యతలను వారే చూసుకుంటామని కూడా చెప్పారని అన్నారు. ఇలాంటి ప్రతిపాదనలను తాను పూర్తిగా తిరస్కరించానని ప్రజల మీద జగన్ మీద విశ్వసం ఉంచానని అన్నారు.

అందువల్లనే ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా తాను ఉన్నానని రాజన్నదొర కార్యకర్తలకు హితోపదేశం చేశారు. తనకు మొదటి విడతలో మంత్రి పదవి దక్కపోయినా పుష్ప శ్రీవాణికి ఇచ్చినా కూడా ఏ మాత్రం అసంతృప్తి చెందలేదని కూడా ఆయన చెప్పడం విశెషం. ఇక పత్రికలలో వస్తున్న వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించడం విశేషం.

అక్కడ వస్తున్న వార్తలు నిజమో కాదో పూర్తిగా నిర్ధారించుకోవాలని ఆయన సూచించారు. అలాగే కార్యకర్తలు నాయకులు ప్రజలను నమ్మాలని, పార్టీ పట్ల చిత్తశుద్ధితో పనిచేయాల‌ని ఆయన కోరారు. ఇవన్నీ సరే కానీ ఇంతటి బ్రహ్మాడమైన అఫర్ తో తనను టీడీపీ తరఫున ఏ బడా నాయకుడు సంప్రదించారు అన్నది మాత్రం రాజన్న దొర బయటపెట్టలేదు.