Begin typing your search above and press return to search.

బాబుగారి సిట్ ఏ పాటితో తేలిపోయిందిగా?

By:  Tupaki Desk   |   1 Aug 2017 8:48 AM GMT
బాబుగారి సిట్ ఏ పాటితో తేలిపోయిందిగా?
X
న‌వ్యాంధ్ర బిజినెస్ కేపిట‌ల్‌ గా ఎదుగుతున్న సాగ‌ర న‌గ‌రం విశాఖ‌ప‌ట్నంతో పాటు ఆ జిల్లా మొత్తాన్ని భూ కుంభ‌కోణాలు వ‌ణికించేస్తున్నాయి. ఒక్క విశాఖ న‌గ‌రమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప‌లు చోట్ల విలువైన ప్ర‌భుత్వ భూముల‌తో పాటు ఆల‌యాలు, మ‌ఠాలు, ప్రైవేట్ వ్య‌క్తుల భూముల‌ను భూ బ‌కాసూరులు చాలా సులువుగా త‌మ సొంత భూములుగా మార్చేసుకుంటున్నారు. ఈ త‌ర‌హా భూ బ‌కాసూరుల్లో అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత‌లదే అగ్రాస‌న‌మ‌న్న అప‌వాదు కూడా లేక‌పోలేదు. ఏపీ సీఎం చంద్ర‌బాబు కేబినెట్ లో కీల‌క శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ సీనియ‌ర్ నేత‌ - విశాఖ జిల్లాకే చెందిన చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌ని చెప్పొచ్చు. అంతేకాకుండా టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీకి చెందిన కీల‌క నేత‌ - ఏపీ శాస‌న‌స‌భ‌లో ఆ పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఉన్న విశాఖ ఉత్త‌ర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన ఆరోప‌ణ‌లు కూడా ఈ వాద‌న‌కు బ‌లం చేకూర్చేవిగానే ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

విశాఖ‌లో వెలుగుచూసిన భూ వివాదాల‌కు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌డంతో చేసేదేమీ లేక... విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేసిన చంద్ర‌బాబు స‌ర్కారు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికే ఈ సిట్ త‌న ప‌నిని ప్రారంభించేసింది కూడా. సిట్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత దానికి కుప్ప‌లు తెప్పలుగా ఫిర్యాదులు వ‌చ్చి ప‌డ్డాయి. ఆ ఫిర్యాదుల్లో అదే జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే పీలా గోవింద స‌త్య‌నారాయ‌ణ కూడా వివాదంలో కూరుకుపోయారు. విలువైన భూముల‌ను కాజేసేందుకు ప‌క్కాగా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్న పీలా... తాను అనుకున్న ప్ర‌కారం కోట్లాది రూపాయ‌ల విలువ చేసే భూమిని త‌న సొంతం చేసుకున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న సిట్‌.... దానిపై విచార‌ణ నిర్వ‌హించి పీలాపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని నిర్ధారించుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. సిట్ పిర్యాదు ఆధారంగా పోలీసులు కూడా పీలాపై కేసు న‌మోదు చేశారు. ఇదంతా మ‌న‌కు తెలిసిందే. అయితే సిట్ విచార‌ణ ప‌రిధిపై ఇప్ప‌టికే సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అదే స‌మ‌యంలో సిట్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కూడా స‌రిగా లేదంటూ ఇప్పుడు కొత్త వాద‌న తెర‌పైకి వ‌చ్చింది.

ప్ర‌భుత్వం వేసిన సిట్ వ్య‌వ‌హార స‌ర‌ళి స‌రిగా లేదంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్న వారు విప‌క్షానికి చెందిన నేత‌లు ఎంత‌మాత్రం కాదు. స్వ‌ప‌క్షానికి చెందిన నేత‌లు - అది కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేస్తున్న వైనంతో చంద్ర‌బాబు స‌ర్కారు త‌ల ప్రాణం తోక‌కొచ్చిన‌ట్లైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. సిట్ వ్య‌వ‌హార స‌ర‌ళి బాగా లేదంటూ టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్ నిన్న ఏకంగా విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్‌ కు ఫిర్యాదు చేశారు. త‌న‌పై కేసు న‌మోదు విష‌యానికి సంబంధించి సిట్ త‌ప్పుడు నివేదిక ఇచ్చింద‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. నిన్న క‌లెక్ట‌ర్‌ కు ఫిర్యాదు చేసిన అనంత‌రం ఆయ‌న అక్క‌డే మీడియాతో మాట్లాడుతూ సిట్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సిట్ విచార‌ణ‌పై త‌మ‌కు ఏమాత్రం న‌మ్మ‌కం లేద‌ని ఆయ‌న తేల్చి పారేశారు. అంతేకాకుండా త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌పై ఎలాంటి ద‌ర్యాప్తు లేకుండానే సిట్ త‌న‌పై కేసు న‌మోదు చేయాలంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిందంటూ ఆయ‌న ఫైరైపోయారు. మ‌రి సిట్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన పీలాపై చంద్ర‌బాబు స‌ర్కారు ఏ త‌ర‌హాలో రియాక్ట్ అవుతుందో చూడాలి.